పీసీసీ టేపులను ఇండ్లలో, కార్యాలయాల్లో లేదా మరే చోటైనా సరే.. విద్యుత్ పని ఉంటే ఎలక్ట్రిషియన్లు కచ్చితంగా పీవీసీ టేపులను వాడుతుంటారు. విద్యుత్ వైర్లను కలిపాక వాటికి టేప్ చుడతారు. అయితే నిజానికి ఆ టేపులను తయారు చేసే బిజినెస్ ద్వారా చక్కని ఆదాయం పొందవచ్చు. చిన్న రూమ్‌లో కూడా ఈ తయారీని మొదలు పెట్టొచ్చు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టి క్రమ క్రమంగా పెంచుకుంటే మంచి ఆదాయం చూడొచ్చు. ఇందుకు గాను ఎంత పెట్టుబడి పెట్టాలో.. ఏ మేర లాభాలు ఈ బిజినెస్‌లో వస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలక్ట్రికల్ టేపుల తయారీకి మెషిన్, ముడి పదార్థాలు ఉంటే చాలు. ఎలక్ట్రికల్ టేపుల తయారీ మెషిన్ ఖరీదు మార్కెట్‌లో దాదాపుగా రూ.1.10 లక్షల వరకు ఉంటుంది. ఇక టేపుల తయారీకి ఉపయోగించే పీవీసీ టేప్ రోల్స్ ఖరీదు ఒక బెండల్‌కు రూ.250 నుంచి రూ.300 వరకు ఉంటుంది. ఒక రోల్‌తో మొత్తం 75 వరకు టేపులను తయారు చేయవచ్చు. అయితే కేవలం ఎలక్ట్రికల్ టేపులు మాత్రమే కాక, సెలో, ప్యాకింగ్ టేపులను కూడా ఈ మెషిన్‌తో తయారు చేయవచ్చు. అందుకు గాను సంబంధిత ముడి పదార్థాలను కొనాల్సి ఉంటుంది.
ఇక మెషిన్‌లో పైపులకు రోల్స్‌ను ఉంచి మెషిన్‌ను ఆపరేట్ చేస్తూ టేపులను కట్ చేయాలి. దీన్ని ఎవరైనా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. కేవలం ఒక్కరే మెషిన్ వద్ద ఉండి టేపులను తయారు చేయవచ్చు. ఇక ఈ టేపులను 15, 18 ఎంఎం సైజులో కావల్సిన సైజును బట్టి తయారు చేయవచ్చు. ఈ క్రమంలో ఒక ఎలక్ట్రికల్ టేపు తయారీకి సుమారుగా రూ.4.25 వరకు ఖర్చవుతుంది. రూ.1 మార్జిన్‌తో టేపును అమ్మితే ఒక టేపును రూ.5.25కు విక్రయించవచ్చు. ఈ క్రమంలో ఒక టేపుకు రూ.1 చొప్పున లాభం వస్తుంది. అదే నిత్యం 2వేల టేపులను తయారు చేస్తే 2000 * 1 = రూ.2వేల లాభం వస్తుంది. నెలకు ఇది రూ.60,000 అవుతుంది. ఇలా నెల నెలా ఈ బిజినెస్‌లో చక్కని ఆదాయం పొందవచ్చు.
అయితే ఈ బిజినెస్‌కు గాను మార్కెటింగ్ బాగా చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ షాపులు, సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రిషియన్లతో టై అప్ అయితే.. నేరుగా వారికే ఈ టేపులను విక్రయించవచ్చు. చక్కని నాణ్యత, తగ్గింపు ధరకు టేపులను విక్రయిస్తే ఈ బిజినెస్‌లో మంచి లాభాలు పొందవచ్చు..!