కష్టపడేతత్వం ఉండాలే గానీ నిజంగా వ్యవసాయం చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అందుకు సరైన ఆలోచన చేయాలి. శ్రమించాలి. నెమ్మదిగా అయినా సరే ప్రయత్నాలు చేయాలి. దీంతో ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు. కేరళకు చెందిన ఆ వ్యక్తి కూడా అలాగే చేశాడు. తండ్రి ద్వారా తనకు వచ్చిన 3 ఎకరాల పొలంలో అరటిపండ్లను పండించడం ప్రారంభించాడు. అందుకు తను ఎంతగానో శ్రమపడ్డాడు. ఇప్పుడు పలు రకాల వెరైటీ అరటిపండ్లను అమ్ముతూ నెలకు ఏకంగా రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నాడు.
కేరళలోని ట్రివేండ్రంకు చెందిన వినోద్ సహదేవన్ నాయర్‌కు వ్యవసాయం అంటే ఆసక్తి. అయితే ఆయన సాంప్రదాయ వ్యవసాయం చేయలేదు. తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిన 3 ఎకరాల పొలంలో అంతకు ముందు వరి పండించేవారు. కానీ వినోద్ మాత్రం వెరైటీ అరటి పండ్లను పండించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించాడు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, బెంగాల్, ఒడిశా, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో పండే రక రకాల అరటి పండ్ల గురించి తెలుసుకున్నాడు. వాటి విత్తనాలను హార్టికల్చర్ విభాగాలు, వ్యవసాయ యూనివర్సిటీలకు వెళ్లి సంపాదించాడు.
ఇక దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు వినోద్ ఇతర దేశాలకు కూడా వెళ్లాడు. మలేషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, హవాయి, హొండురాస్ తదితర దేశాలు తిరిగి కోస్తా తీర ప్రాంతాల్లో పెరిగే వెరైటీ అరటిపండ్లకు చెందిన విత్తనాలను సేకరించాడు. వాటిని ఇంటికి తీసుకువచ్చి తన 3 ఎకరాల పొలంలో పండించాడు. ఇంకేముందీ.. అప్పటి నుంచి ఇక వినోద్ వెనుదిరిగి చూడలేదు. దీంతో ప్రస్తుతం అతని పొలంలో ఏకంగా 430 వెరైటీలకు పైగా అరటిపండ్లు పండుతున్నాయి. ఇక వాటిని అమ్ముతూ ఆయన నెల నెలా అక్షరాలా రూ.1 లక్ష వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు.
వినోద్ పొలంలో ప్రస్తుతం అస్సాంకు చెందిన పొడవైన వెరైటీ అరటిరకం ప్లాంటెయిన్‌తోపాటు పొట్టి అరటి వెరైటీ జహాంజీ కూడా పండుతోంది. అలాగే లేడీస్ ఫింగర్ బనానా, రెడ్ బనానా, బ్లూ జావా తదితర అనేక రకాల అరటిపండ్లను ఆయన పండిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన కేవలం తన స్వలాభమే చూసుకోలేదు. చుట్టు పక్కల ఉన్న రైతులకు ఇలాంటి వెరైటీ పండ్లను పండించడంపై సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నాడు. ఇక త్వరలోనే ఆయన తన పొలాన్ని మరింత విస్తరించి మరిన్ని వెరైటీలకు చెందిన అరటిపండ్లను పండించే యోచనలో ఉన్నాడు..!