ఇటీవల రూపాయి విలువ భారీగా పతనమైన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ వేదికగా వివరణ ఇచ్చారు. వాస్తవానికి రూపాయి విలువలో ఎలాంటి పతనం లేదని పేర్కొన్నారు. దాని సహజరీతిలోనే అది ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు.
ఆర్‌బీఐ నిరంతరం రూపాయి కదలికలపై దృష్టి సారిస్తోందని తెలిపారు. అయితే, అవసరమైనప్పుడు కేవలం ఒడుదొడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే ఆర్‌బీఐ మధ్యలో జోక్యం చేసుకుంటోందని వివరించారు. అంతే తప్ప రూపాయి విలువను నిర్దేశించే చర్యలేమీ చేపట్టడం లేదని తెలిపారు.
ఇతర దేశాల తరహాలో ప్రభుత్వంగానీ, ఆర్‌బీఐగానీ రూపాయి విలువ విషయంలో జోక్యం చేసుకోవడం లేదని సీతారామన్ తెలిపారు. రూపాయి సహజరీతిలో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలంలో రూపాయి బలోపేతానికి కావాల్సిన చర్యలపై మాత్రం ప్రభుత్వం, ఆర్‌బీఐ దృష్టి సారించాయని తెలిపారు. ప్రవాస భారతీయులు విదేశీ కరెన్సీల్లో డబ్బులు బదిలీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విపక్ష సభ్యులు మంత్రికి సూచించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. ఈ అంశం తమ పరిధిలోనిది కాదని, దీన్ని ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువలో ఒడుదొడుకులు కనిపించినప్పటికీ.. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మాత్రం బలంగా ఉందని సీతారామన్ తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయాల ప్రభావాన్ని ఇతర కరెన్సీల కంటే రూపాయే బలంగా ఎదుర్కోగలిగిందన్నారు.
విదేశీ మారక నిల్వలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై స్పందిస్తూ.. రిజర్వుల్లో ఇంకా 500 బిలియన్ డాలర్లకుపైనే ఉన్నాయన్నారు. జులై 22 నాటికి 571.56 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ఇది చిన్న మొత్తమేమీ కాదన్నారు. ఈ విషయంలో భారత్‌కు ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు.