మాజీ మంత్రి పార్థా ఛటర్జీకి అవమానం ఎదురైంది. ఓ మహిళ కోపంతో ఆయనపైకి చెప్పు విసిరారు. ప్రజల డబ్బును కొల్లగొట్టిన వ్యక్తి కార్లలో తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ల్కతాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీపై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోపంతో ఆయనపైకి చెప్పు విసిరారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ను వైద్య పరీక్షల కోసం కోల్కతాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకొచ్చిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన పేరు సుభ్ర ఘాడైగా పేర్కొన్న మహిళ.. తనది దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అమ్టాలా ప్రాంతమని విలేకర్లతో చెప్పారు.
అయితే, మాజీ మంత్రిపైకి చెప్పు ఎందుకు విసిరారంటూ మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించగా.. ‘‘ఎంతోమంది పేద ప్రజల డబ్బును కొల్లగొట్టిన విషయం మీకు తెలియదా? మరి నన్నెందుకు అడుగుతున్నారు? అలాంటి వ్యక్తిని ఏసీ కార్లలో తిప్పుతున్నారు. అతడి మెడకు తాడు కట్టేసి ఈడ్చుకెళ్లాలి. ఆ చెప్పు అతడి తలకు తగిలితే ఎంతో సంతోషించేదాన్ని. ఎంతోమంది ప్రజలకు తినడానికి తిండిలేదు.. పార్థా ఛటర్జీ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడేమో నగదు దాచుకోవడానికి ఫ్లాట్లు కొంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ కోపం నా ఒక్కదానిదే కాదు.. లక్షల మంది బెంగాల్ ప్రజలది’’ అని మహిళ చెప్పుకొచ్చారు.
మహిళ చెప్పు విసరడంతో పార్థా ఛటర్జీని చుట్టుముట్టిన సిబ్బంది ఆయన్ను సురక్షితంగా తరలించారు. చుట్టూ భారీ సంఖ్యలో సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్థా ఛటర్జీ, అతడి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఉన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది.