ఎన్టీఆర్ బ‌యోపిక్ అట్ట‌ర్‌ఫ్లాప్ వెనుక ఉన్న 5 ప్ర‌ధాన కార‌ణాలివే..!

-

సాధార‌ణంగా ఏ రంగానికి చెందిన ప్ర‌ముఖుల బ‌యోపిక్‌లను సినిమాలుగా తీసినా స‌రే.. అవి హిట్లుగా నిలిచాయి. కానీ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఎన్‌టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు భారీ ఫ్లాప్‌లుగా నిలిచాయి. నిజానికి ఈ సినిమాలు బాల‌కృష్ణ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్లుగా నిలిచాయ‌ని చెప్ప‌వ‌చ్చు. జ‌న‌వ‌రిలో సంక్రాంతికి వ‌చ్చిన ఎన్‌టీఆర్ క‌థానాయకుడు సినిమా నిరాశ పరిచే స‌రికి డిస్ట్రిబ్యూట‌ర్లు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోయారు. అయితే ఇటీవ‌లే విడుద‌లైన ఎన్‌టీఆర్ మ‌హానాయ‌కుడుతోనైనా ఆ న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌వ‌చ్చ‌ని అనుకుంటే.. ఈ సినిమా కూడా దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌ను వదిలేస్తే.. క‌నీసం నంద‌మూరి అభిమానుల‌కు, టీడీపీ శ్రేణుల‌కు, బాల‌కృష్ణ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి కూడా ఈ రెండు సినిమాలు  న‌చ్చ‌లేదు. అయితే అస‌లు ఎన్టీఆర్ బ‌యోపిక్ ఇంత భారీ ఫ్లాప్ అవ‌డానికి కార‌ణాలు ఏంటి.. అని విశ్లేషిస్తే..

ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు భారీ ఫ్లాప్ అయ్యేందుకు అనేక కార‌ణాలున్న‌ప్ప‌టికీ ప్ర‌ధానంగా మ‌న‌కు 5 కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. అవేమిటంటే…

1. నిజాలు చెప్ప‌లేదు..?

గ‌తంలో వ‌చ్చిన సావిత్రి బ‌యోపిక్‌, ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ ల‌లో ఆ యాక్ట‌ర్ల‌కు చెందిన పాజిటివ్‌, నెగిటివ్ షేడ్స్ రెండూ చూపించారు. అలాగే ఆ పాత్ర‌ల్లో న‌టించిన యాక్ట‌ర్లు కూడా త‌మ త‌మ క్యారెక్ట‌ర్ల‌లో జీవించారు. దీంతో ప్రేక్ష‌కులు ఆ సినిమాల‌కు బాగా క‌నెక్ట్ అయ్యారు. బ‌యోపిక్ అంటే.. ఆ వ్య‌క్తికి చెందిన అన్ని కోణాల‌ను సినిమాలో చూపించాలి. అప్పుడే ఆ సినిమా రియ‌ల్ లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. దాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యానికి వ‌స్తే ఎన్‌టీఆర్ లో ఉన్న పాజిటివ్ షేడ్స్‌ను మాత్ర‌మే చూపించారు. ఆయ‌నొక మ‌హా నేత‌, గొప్ప యాక్ట‌ర్.. అది అంద‌రూ ఒప్పుకోవ‌ల్సిందే. కానీ ఆయ‌న‌లో ఉన్న నెగిటివ్ షేడ్స్‌ను చూపించ‌లేదు. దీంతో ఎక్క‌డో తేడా కొట్టింది. ఎన్టీఆర్ లో ఉన్న నెగెటివ్ షేడ్స్‌ను చూపించ‌డం బాల‌కృష్ణ‌కు న‌చ్చ‌లేదో, లేదంటే ఆ కోణంలో సినిమా తీస్తే టీడీపీ శ్రేణులు, నంద‌మూరి అభిమానులు ఏమ‌నుకుంటారోన‌న్న భ‌యం ద‌ర్శ‌కుడికి ఉండి ఉండ‌వ‌చ్చు. అందుకే ఎన్‌టీఆర్ పాత్ర‌ను కేవ‌లం పాజిటివ్‌గానే చూపించారు త‌ప్ప దానికి నెగిటివిటీని అంట‌గ‌ట్ట‌లేదు. అంత పెద్ద సాహ‌సం ఎందుకులే అని అనుకోవ‌డంతోనే ఎన్‌టీఆర్‌ను అలా ఒక యాంగిల్‌లో మాత్ర‌మే చూపించారు. దీనికి తోడు సినిమాలో ల‌క్ష్మీపార్వ‌తి ఎపిసోడ్ లేదు. నిజానికి ఎన్‌టీఆర్ జీవితంలో ఆమెది ఒక కీల‌క‌పాత్ర‌. అలాంటిది ఆ పాత్ర లేకుండా బ‌యోపిక్ తీస్తే.. జ‌నాల‌కు ఎన్‌టీఆర్ నిజ‌మైన క‌థ చెప్పిన‌ట్లు ఎలా అవుతుంది ? కాదు క‌దా.. సినిమా చూసే స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు దాదాపుగా ఎన్టీఆర్ జీవితం గురించి తెలుసు. అలాంట‌ప్పుడు కీల‌క‌మైన పాత్ర‌ను లేకుండా సినిమా తీస్తే అప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను పూర్తిగా చెప్పిన‌ట్లు ఎలా అవుతుంది ? ఇవే ప్ర‌శ్న‌లు సాధార‌ణ ప్రేక్ష‌కుడికి కూడా వ‌స్తాయి. అప్పుడు ప్రేక్ష‌కులు సినిమా చూసేందుకు ఆస‌క్తి చూపించ‌రు క‌దా.. క‌నుక ఈ అంశం కూడా ఎన్‌టీఆర్ బ‌యోపిక్ ఫెయిల్ అవ‌డం వెనుక ఉన్న ఓ కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు.

2. ఎమోష‌న‌ల్ సీన్లు

సావిత్రి, సంజ‌య్ ద‌త్‌ల బ‌యోపిక్ ల‌లో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసే సీన్లు ఉన్నాయి. అవి ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌కు క‌నెక్ట్ అవుతాయి. కానీ ఎన్‌టీఆర్ బ‌యోపిక్‌లో అలాంటి సీన్లు లేవు. ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకునే విధంగా సీన్ల‌ను తీయ‌డంలో ద‌ర్శ‌కుడు వైఫ‌ల్యం చెందాడ‌నే చెప్ప‌వ‌చ్చు. అందుక‌నే ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.

3. బాల‌కృష్ణ పాపులారిటీ

సినీ న‌టుడు బాల‌కృష్ణ మాట‌లు, చేత‌లు హ‌ద్దులు మీరుతున్నాయి. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం, త‌న అభిమానుల‌నే కొట్ట‌డం వంటి చ‌ర్య‌ల కార‌ణంగా ఆయ‌న‌కు పాపులారిటీ త‌గ్గుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అందుకనే ఆయ‌న సినిమా చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపించ‌లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎన్‌టీఆర్ బ‌యోపిక్ వైఫ‌ల్యం వెనుక ఉన్న కార‌ణాల్లో ఇది కూడా ఒక‌టి.

4. త‌క్కువ స‌మ‌యంలోనే…

ద‌ర్శ‌కుడు క్రిష్ చాలా త‌క్కువ రోజుల్లోనే సినిమా తీయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు. అయితే ఎన్‌టీఆర్ లాంటి మ‌హానేత‌కు చెందిన బ‌యోపిక్ అంటే ఆషామాషీ కాదు క‌దా. దాన్ని కనీసం 1 సంవ‌త్స‌రం పాటు షూటింగ్ చేసి… మ‌రో 6 నెల‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేసి రెండేళ్ల గ్యాప్‌లో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. ప్రేక్ష‌కుల్లో ఒక ర‌క‌మైన ఆస‌క్తిని రేపి వారిని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేది. కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ ను కేవ‌లం 5 నెల‌ల్లోనే తీశారు. అంత త‌క్కువ టైములో బ‌యోపిక్‌ను తీస్తే అది ప‌ర్‌ఫెక్టుగా రాదు. ఎందుకంటే సీన్ల‌ను ఎడిట్ చేసుకోవ‌డం, స‌రిగ్గా రాని సీన్ల‌ను మ‌ళ్లీ తీయ‌డం.. వంటి ప‌నులు పెట్టుకునేందుకు టైముండ‌దు. దీంతో సినిమాను కాంప్ర‌మైజ్ అయి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాలు కూడా అలాగే త‌క్కువ గ్యాప్‌లో కాంప్ర‌మైజ్ అయి రిలీజ్ చేశారు. దీంతో సినిమా క్వాలిటీ పోయింది. ప్రేక్ష‌కుల‌కు నాసిర‌కంగా అనిపించింది. అందుక‌నే ఎన్‌టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాల‌కు ప్రేక్ష‌కులు దూరంగా ఉన్నారు.

5. గెట‌ప్‌ల‌ను ముందే రివీల్ చేయ‌డం…

బ‌యోపిక్ అనే కాదు.. ఏ సినిమా అయినా స‌రే.. ముందుగానే అందులో ఉన్న పాత్ర‌ల గురించి చెప్పేస్తే.. ఇక సినిమాపై ఆస‌క్తి ఏముంటుంది ? అందుకే రాజ‌మౌళి లాంటి వారు ఓ వైపు సినిమా గురించి, మ‌రో వైపు అందులో ఉండే పాత్ర‌ల గురించి సస్పెన్స్‌ను మెయింటెయిన్ చేస్తుంటారు. ఎప్పుడో చాలా గ్యాప్ త‌రువాత కానీ సినిమాలోని పాత్ర‌ల గురించి రివీల్ చేయ‌రు. కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ అలా కాదు. పూర్తిగా భిన్నం. సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అందులో ఉన్న అన్ని గెట‌ప్‌ల‌ను రివీల్ చేశారు. అయితే అది ఓకే అనుకున్నా.. ఆ గెట‌ప్ ల‌కు బాల‌కృష్ణ సూట్ కాలేద‌న్న వార్త‌లు వినిపించాయి. దీంతో గెట‌ప్‌లే అలా ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందోలే.. చూడ‌డం అవ‌స‌ర‌మా.. అన్న ధోర‌ణిలో ప్రేక్ష‌కులు సినిమాల‌కు వెళ్ల‌డ‌మే మానేశార‌ని చెప్ప‌వ‌చ్చు. ఏది ఏమైనా.. ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు మాత్రం డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు తీర‌ని న‌ష్టాల‌నే మిగిల్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఆ న‌ష్టాల‌ను పూడ్చేందుకు చిత్ర యూనిట్ ఏమైనా చేస్తుందో.. లేదో.. వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version