ఏపీలో అధికార పార్టీ టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే వైకాపాలో చేరారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి రానున్న రోజుల్లో మరింత మంది బయటకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా వైకాపాలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తమ పార్టీ టీడీపీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారని… దీంతో ఆయన త్వరలో వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తన టిక్కెట్ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతుండగా, ఆ విషయంలో చంద్రబాబు నుంచి ఎటువంటి హామీ ఆయనకు లభించడం లేదట. దీంతో ఆయన టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇక మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీదేవమ్మ, ప్రవీణ్ కుమార్ రెడ్డిలను తిరిగి పార్టీలోకి తీసుకుని వారిలో ఒకరికి టిక్కెటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, ప్రవీణ్ కుమార్ రెడ్డికి మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, హౌసింగ్ బోర్డు చైర్మన్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు సహకరిస్తున్నారని శంకర్ యాదవ్ ఆరోపణలు చేస్తున్నారు.
కాగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల మీద చంద్రబాబు ఇటీవలే సమీక్ష నిర్వహించారు. కానీ అందులో తంబళ్లపల్లె టిక్కెట్‌ను ఎవరికి ఇవ్వనుంది చంద్రబాబు ఖరారు చేయలేదు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు టిక్కెట్ ఖరారు చేయకపోవడంపై శంకర్ యాదవ్ అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. అందుకనే ఆయన వైకాపాలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకుంటున్నారని సమాచారం. అయితే సీఎం చంద్రబాబుతో మరోసారి మాట్లాడాకే శంకర్ యాదవ్ నిర్ణయం తీసుకుంటారని కూడా తెలిసింది. ఈ క్రమంలో శంకర్ యాదవ్ వైసీపీలో చేరిక ఎప్పుడనేది అతి త్వరలో తెలియనుంది. అయితే ఆయన గనక వైసీపీలో చేరితే టీడీపీకి మరో షాక్ తగిలినట్లే అవుతుంది..!