కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. ఆయనతో సినిమా చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) అనే చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. అజిత్ సినిమాతో ఈ నిర్మాణ సంస్థ తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. విశాల్ ‘మార్క్ ఆంటోనీ’తో మంచి హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
అజిత్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉందిని మేకర్స్ తెలిపారు. అధిక్ స్క్రిప్ట్ చాలా బాగా రాశారని సినీ ప్రియులకు మంచి అనుభవాన్ని అందిస్తామన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. అజిత్, అధిక్లు పరిశ్రమలో మంచి స్నేహితులు. ‘నేర్కొండ పార్వై’ చిత్రంతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం అజిత్ మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదా ముయార్చి’ చిత్రంలో నటిస్తున్నారు.