తెలంగాణలో నేటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ ‘టీజీ కోడ్‌తో మొదలు కానుంది. కొత్త వాహనాల నంబర్ ప్లేట్లపై ఇవాళ్టి నుంచి టీఎస్ బదులు ‘టీజీ’ కోడ్ రానుంది. జిల్లాల నంబరు కోడ్‌లు పాతవే కొనసాగుతాయని ప్రభుత్వ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం రోజున గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీకి మార్పు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఆ మేరకు రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి పంపగా, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ మార్క్ (కోడ్)తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది. నూతన సీరీస్‌ను హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. జిల్లాల కోడ్‌ల తర్వాత రవాణా వాహనాలు, ఆర్టీసీ బస్సుల సిరీస్ నిర్దేశిత అక్షరాలతో ప్రారంభమవుతుంది. రవాణా వాహనాలకు టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్ ఉంటాయి. ఆర్టీసీ బస్సులు ఎప్పటిలాగే ‘జడ్’ సిరీస్‌తో మొదలవుతాయని అధికారులు తెలిపారు.