‘ అల వైకుంఠ‌పురంలో ‘ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…

టాలీవుడ్ సినిమాల‌కు బిగ్గెస్ట్ సీజ‌న్ సంక్రాంతి సీజ‌న్‌. సంక్రాంతికి సినిమా వ‌స్తుందంటే సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా భారీ వ‌సూళ్లు వ‌స్తుంటాయి. ఇక ఈ క్ర‌మంలోనే వ‌చ్చే సంక్రాంతికి సైతం టాలీవుడ్‌లో మూడు, నాలుగు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు ముస్తాబ‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠ‌పురం కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ రెండు సినిమాలు ఇప్ప‌టికే ఖ‌ర్చీఫ్ వేసుకున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం అల్లు అర్జున్ సినిమాకు విడుదల తేదీని ఖరారు చేశారు. జనవరి 12 వ తారీఖు.. ఆదివారం నాడు అల వైకుంఠపురములో సినిమాను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు పోటీగా వ‌స్తోన్న మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా డేట్ మాత్రం ఖ‌రారు కాలేదు.

విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్ సినిమాను జ‌న‌వ‌రి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందన్నమాట. ఇక త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే అల వైకుంఠపురములో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిలిం ఇది. ఇప్ప‌టికే వీరి కాంబోలో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు వ‌చ్చాయి. ఇది మూడో సినిమా అవుతుంది. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సుశాంత్.. నివేద పేతురాజ్.. నవదీప్.. టబు.. సత్యరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.