మెగా హీరో అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. కాసులు కూడా కాస్త బాగానే కురిపించింది. అయినా శిరీష్ కు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను ఇవ్వలేకపోయింది. చాలా కాలంగా శిరీష్ సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కాస్త గ్యాప్ ఇచ్చి తాజాగా బడ్డీ అనే సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న బడ్డీ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. రౌడీ గ్యాంగ్ ఓ టెడ్డీని చంపేందుకు ప్రయత్నించే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక టెడ్డీ మనుషుల్లా ప్రవర్తించడం మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. అల్లు శిరీష్ టెడ్డీని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడనే విషయాలపై గ్లింప్స్ లో సస్పెన్స్ లో పెట్టాడు డైరెక్టర్. చివరలో టెడ్డీ గన్‌తో రౌడీలను షూట్ చేస్తున్న సీన్లతో ముగిసింది వీడియో.
తమిళ్ లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వస్తున్న ఈ మూవీకి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేఈ జ్ఞానవేళ్ రాజా సమర్పణలో ఆధన జ్ఞానవేళ్ రాజాతో కలిసి నిర్మిస్తున్నారు. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేశ్ కుమార్, మహ్మద్ అలీ, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు.