బ్యూటీ స్పీక్స్ : ఆడాళ్ల‌కు జోహార్లు..ర‌ష్మికకు అభినంద‌న‌లు

అదృష్టం కొన్నిసార్లు
కొంద‌రికే సొంతం

అవ‌కాశం కొన్నిసార్లు
కొంద‌రికే పరిమితం

అదృష్టం,అవ‌కాశంతో పాటు
రాణించాల‌న్న సంక‌ల్పం
రాసి పెట్టి ఉండే తిరుగే ఉండ‌దు
అలాంటి తిరుగులేని రాత ర‌ష్మికది….

కోవిడ్ వ‌ల్ల నిరాశ‌లో ఉన్న మ‌నంద‌రికీ వినోదం పంచే చిత్రం ఇది అని అంటున్నారు ర‌ష్మిక. ఆడ‌వాళ్ల‌మంతా క‌లిసి చాలా స‌ర‌దాగా చేసిన చిత్ర‌మిది అని కూడా చెబుతున్నారీమె! తాజాగా చిత్రం ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అంటూ.. ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ర ర‌ష్మిక ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీకే ల‌క్కీ ఛార్మ్.

ఈ నేప‌థ్యంలో వ‌రుస సినిమాల‌తో విజ‌యాలు న‌మోదు చేస్తున్న ర‌ష్మిక..ఇప్పుడు ఆ హ‌వాను మ‌రింత కొన‌సాగించేందుకు సిద్ధం అవుతోంది.గీతగోవిందంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను టీజ్ చేసిన ఆ అమ్మాయే పుష్ప‌లోనూ సంద‌డి చేసింది. స‌రి లేరు నీకెవ్వ‌రు సినిమాతో మహేశ్ బాబు స‌ర‌స‌న న‌టించి మంచి మార్కులే కొట్టేసింది. ఆయ‌న క్యూట్నెస్ కు ఫిదా అయిపోయి పాట‌లు పాడి అభిమానుల‌ను అల‌రించింది. సామీ సామీ అంటూ అల్లూ అర్జున్ వెంట ప‌డి ద‌క్షిణాదిలోనే కాదు ఉత్త‌రాదిలోనూ ఫ్యాన్ ఫాలోవ‌ర్స్ ను ద‌క్కించుకుంది.

ఇన్నీ వ‌చ్చాక ఇంకేం ఇంకేం కావాలే! చాల్లే ఇది చాల్లే! అని అన‌కుంటుందా ఈ అమ్మ‌డా? తాజాగా తోటి ఆడాళ్ల‌కు జోహార్లు చెబుతోంది.వారితో ప్రేమ క‌బుర్లు పంచుకుంటోంది. కోవిడ్ ద‌శ‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ కొత్త సినిమా ఊసులు కాస్త ఉప‌శ‌మ‌నం క‌నుక ర‌ష్మిక న‌టించిన కొత్త సినిమా మానియాలో అభిమానుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలూ ఉన్నాయి.

ఆడాళ్ల ముచ్చ‌ట వినిపిస్తూ..

వాస్త‌వానికి పుష్ప సినిమా త‌రువాత భ‌లే క్రేజ్ కొట్టేసింది ర‌ష్మిక. ఈ సినిమాతో అటు బాలీవుడ్ లోనూ,ఇటు టాలీవుడ్ లోనూ ఆమె హ‌వాకు అస్స‌లు ఎదురేలేకుండా పోతోంది.తాజాగా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో న‌టిస్తోంది. శ‌ర్వానంద్ స‌ర‌స‌న తొలిసారి న‌టిస్తోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లు నిన్న‌టివేళ హైద్రాబాద్ లో జ‌రిగాయి.ఈ వేడుక‌ల‌కు ఆమెతో పాటు అందాల కీర్తీ సురేశ్,సాయి ప‌ల్ల‌వి విచ్చేశారు. యాంక‌ర్ సుమ త‌న‌దైన వ్యాఖ్యానంతో సంద‌డి చేశారు.

శ‌ర్వానంద్ తో స‌హా మిగ‌తా భామలంతా న‌వ్వుతూ న‌వ్విస్తూ వేదిక‌పై పండ‌గ వాతావ‌ర‌ణం నింపారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాకు తిరుమ‌ల కిశోర్ ద‌ర్శ‌కులు.దేవీ శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించారు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మాణ సార‌థ్యంలో రూపొందింది. మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ విడుద‌ల‌యి సంద‌డి చేస్తోంది.పుష్ప ఫేం ర‌ష్మిక ఈ సినిమాకో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అని అంటున్నారు ద‌ర్శ‌క,నిర్మాతలు.

ఇంకా చెప్పాలంటే…

విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌లుకుని అల్లు అర్జున్ వ‌ర‌కూ అంద‌రితోనూ న‌టించి, అంద‌రికీ మ‌రువ‌లేని విజ‌యాలు ఇచ్చిన ర‌ష్మిక త్వ‌ర‌లో పుష్ప సినిమా కొన‌సాగింపు భాగంలో న‌టించ‌నుంది.మొద‌టి భాగం క‌న్నా ఈ భాగంలో ఆమె పాత్ర తీరు తెన్నులూ, న‌డ‌వ‌డీ అన్నీ బాగుంటాయి అని చెబుతున్నాయి ఆ చిత్ర వ‌ర్గాలు. ఆఖరుగా ఓ విన్న‌పం.. వ‌స్తున్న ప్ర‌తి ప్రాజెక్టు కూడా ఆమెకు విజ‌యాల‌నే అందించాల‌ని కోరుకుందాం.