భారతీయ సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి ఒక సంచలనం. అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలుగిన ఆమె బయోపిక్ రానున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్స్ పై శ్రీదేవి భర్త బోనీ కపూర్ తాజాగా స్పందించారు. తన భార్య చాలా ప్రైవేట్ పర్సన్ అని, ఆమె వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి ఇష్టపడేది కాదని అన్నారు. తను బతికున్నన్ని రోజులు అలానే ఉందని చెప్పారు. ఇప్పుడు ఆ పర్సనల్ విషయాలు బయటకు చెప్పడానికి తాను అంగీకరించనని, తాను బతికి ఉన్నంతవరకు బయోపిక్‌కు అనుమతివ్వను అని బోనీ కపూర్ స్పష్టం చేశారు.
బాలనటిగా సినీ జీవితం మొదలుపెట్టిన శ్రీదేవి తెలుగు, హిందీ, తమిళం ఇలా అన్ని ఇండస్ట్రీల్లో అగ్రహీరోలందరి సరసన నటించారు. తన నటనతో అన్ని భాషల్లోని సినీప్రియులను అలరించి సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. శ్రీదేవి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్, శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు. ‘‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’’ (The Life Of A Legend) పేరుతో ఇది రానుంది. దీనికోసం శ్రీదేవి కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకున్నట్లు వెల్లడించారు.