26 ఏళ్ల త‌ర్వాత ఆ హీరోయిన్‌తో సీనియ‌ర్ హీరో

936

విజయశాంతి.. తెలుగు వారికి పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్. కొన్నాళ్లు రాజకీయాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. మ‌ధ్య‌లో ప్ర‌త్యేక తెలంగాణ కోసం త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన ఆమె ఆ త‌ర్వాత త‌న పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి ఎంపీ అయ్యారు. ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కాంగ్రెస్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు మెద‌క్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత విజయశాంతి ఇటీవలే మరోసారి మేకప్ వేసుకున్నారు.

chiranjeevi and vijayashanti to act in koratala siva movie
chiranjeevi and vijayashanti to act in koratala siva movie

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి – విజ‌య‌శాంతి కాంబినేష‌న్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ జోడీ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించింది. ఆ సూపర్ హిట్ జోడి చాలా ఏళ్ల తర్వాత మరోసారి కలిసి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి అనే పీరియాడిక‌ల్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో ఓ కీల‌క రోల్ కోసం కొర‌టాల విజ‌య‌శాంతిని సంప్ర‌దించ‌గా… ఆమె ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో విజ‌య‌శాంతి న‌టిస్తే 26 సంవ‌త్స‌రాల త‌ర్వాత చిరంజీవి – విజ‌య‌శాంతి క‌లిసి న‌టించిన‌ట్ల‌వుతుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో అప్పట్లో 19 సినిమాలు రాగా.. అందులో 10కి పైగా మంచి విజయాలుగా నిలిచాయి. చివరగా ఈ ఇద్దరూ 1993లో మెకానిక్ అల్లుడు‌లో కనిపించారు.