మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. సినీ ప్రముఖులు, జనసంద్రంలా మెగా అభిమానులు ఈ ఫంక్షన్ కు తరలివచ్చారు. ఈ చిత్రంలో నటించిన వారు, మెగాస్టార్ తో నెక్స్ట్ సినిమాలు తీసే దర్శకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అలనాటి తాను అవమానానికి గురైన సంగతులను గుర్తు చేసుకున్నాడు. 1988లో తాను నటించిన ‘రుద్రవీణ’ చిత్రానికి నేషనల్ ఇంటిగ్రిటి అవార్డు వచ్చిందని తెలిపాడు. ఆ అవార్డు తీసుకోవడానికి ఢిల్లికీ వెళితే, అక్కడ సినీ ప్రముఖుల గురించి డిస్ ప్లే చేశారని, అందులో కేవలం హిందీ నటీ నటుల గురించి మాత్రమే వచ్చిందన్నాడు. ఎంజీఆర్, జయలలిత పేర్లను వేశారని, కానీ, అనుకున్న స్థాయిలో వారి గురించి లేదని చెప్పాడు.
అప్పుడు తాను చాలా బాధపడ్డానని, అవమానానికి గురయ్యానని పేర్కొన్నాడు. ఈ విషయమై తాను అప్పట్లో మీడియాతో మాట్లాడానని కూడా తెలిపారు మెగాస్టార్. అయితే, ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవని, తాను గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా ‘బాహుబలి, బాహుబలి 2, RRR’ సినిమాలు తీసి రాజమౌళి తెలుగువాళ్లందరూ గర్వపడేలా చేశారని కొనియాడారు.
ఈ సందర్భంగా తాను రాజమౌళిని గౌరవించడంతో పాటు సత్కరిస్తానని పేర్కొన్ని చిరు..స్టేజీపైన రాజమౌళిని సత్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ భారతీయ సినిమా అనేది మతం అయితే కనుక ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి అని అభివర్ణించారు. ‘ఆచార్య’ చిత్రంలో పని చేసేందుకుగాను రామ్ చరణ్ డేట్లు ఇచ్చి, షూటింగ్ కు అనుమతించినందుకు థాంక్స్ చెప్పారు.