సినీ నిర్మాత అవ‌తారం ఎత్త‌నున్న కేసీఆర్‌.. కొత్త ట్రెండ్‌

-

పొద్ద‌స్త‌మానూ.. తిన‌కూసుంటే.. మ‌నిసికి, గొడ్డుకు తేడా ఏవుంటాది!! అన్న రావుగోపాల‌రావు మాట అక్ష‌ర స‌త్యం చేయాల‌ని త‌ల‌చారో ఏమో.. లేక‌, కొన్ని ద‌శాబ్దాలుగా చేస్తున్న రాజ‌కీయాలు ఆయ‌న‌కు బోర్ కొట్టా యో.. ఇవీ కాక‌.. తెలుగు క‌ళామ‌త‌ల్లికి కొంత వ‌ర‌కైనా సేవ చేసుకుందామ‌ని ఆయ‌న భావించారో.. తాజాగా ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. అటు రాష్ట్ర పాల‌న‌, ఇటు పార్టీని న‌డిపించే ఉద్ధండ పిండంగా నిత్యం బిజీబిజీగా గ‌డిపే.. కేసీఆర్ ఒక్క‌సారిగా తెలుగు క‌ళామ‌త‌ల్లికి సేవ చేసుకోవాల‌ని అనిపిం చ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

విష‌యంలోకి వెళ్తే.. క‌ళాత‌ప‌స్వి, దిగ్ద‌ర్శ‌కుడు కాశీనాధుని విశ్వ‌నాథ్ ఇంటికి స్వ‌యంగా కేసీఆర్ వెళ్లారు.
ప్ర‌స్తుతం ఆయ‌న‌వ‌యోవృద్ధుడు కావ‌డంతో ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. ఒక‌టి అరా ప్ర‌ముఖ కార్య‌క్ర‌మా ల‌కు మాత్ర‌మే ఆయ‌న హాజ‌ర‌వుతున్నారు. అటువంటి ఆయ‌న ఇంటికి ఒక్క‌సారిగా ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే కేసీఆర్ వెళ్ల‌డం, కుటుంబ స‌మేతంగా విశ్వ‌నాథ్‌ను స‌త్క‌రించ‌డం ఆయ‌న‌తో భేటీ అయి దాదాపు గంట‌కు పైగా చ‌ర్చలు జ‌ర‌ప‌డం అటు సినీ వ‌ర్గాల‌ను, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌ను కూడా ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

అయితే, ఈ సంద‌ర్భంగానే కేసీఆర్‌.. క‌ళాత‌ప‌స్విని ప్రోత్స‌హించే వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని క‌ళాకారులు, సినీ ప్ర‌ముఖులు కూడా స్వాగ‌తిస్తున్నారు. వాస్త‌వానికి క‌ళాభిరుచి ఉన్న కేసీఆర్ ఏ వేదికెక్కినా, ఏ సంద‌ర్భం వ‌చ్చినా.. తెలుగును, క‌ళ‌ల‌ను, క‌వుల‌ను మెచ్చుకోవ‌డం ఆశువుగా కొన్ని తెలుగు ప‌ద్యాలు చెప్ప‌డం వంటివి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ‘మీరు మళ్లీ మంచి సినిమా తీయాలి. మీ అసిస్టెంట్ల‌ సాయంతో సినిమా తీయండి. నిర్మాణం సంగతి మరిచిపోండి, అది నేను చూసుకుంటాను అని విశ్వ‌నాథ్‌తో అన్నారు.

ఈ ప‌రిణామం నిజానికి చాలా ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. నేటి సినిమా రంగంలో ఇలాంటి క‌ళా ద‌ర్శ‌కులు నానాటికీ త‌గ్గిపోతున్నారు. జానా బెత్తెడు గుడ్డ‌లు, బూతు మాట‌ల స‌మాహారంగా ఉన్న నేటి సినిమాలు కుటుంబ స‌మేతంగా చూడ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డిన త‌రుణంలో విశ్వ‌నాథ్ వంటి ద‌ర్శ‌కుల‌ను ఇలా ప్రోత్స‌హించ‌డం ముదావ‌హం అంటున్నారు సినీ పండితులు. మ‌రి నిజంగానే కేసీఆర్ నిర్మాత అవ‌తారం ఎత్తుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news