పిచ్చిపిచ్చిగా మాట్లాడకు పవన్… కమెడియన్ పృథ్వీ వార్నింగ్

కమెడియన్ పృథ్వీ.. పవన్ కల్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు. వైఎస్సార్సీపీపై పవన్ అనవసర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పృథ్వీ విరుచుకుపడ్డారు..

ఏంటి.. తొక్క తీస్తావా? తోలు తీస్తావా? నీదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా పవన్ కల్యాణ్.. అంటూ కమెడియన్ పృథ్వీ పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. ప్రభుత్వ పాలనను విమర్శించవు. చంద్రబాబును పల్లెత్తి మాట అనవు. కానీ.. ప్రతిపక్షనాయకుడిని మాత్రం విమర్శిస్తావా? నువ్వొక అసమర్థ నాయకుడివి పవన్.. అంటూ పృథ్వీ.. పవన్ పై నిప్పులు చెరిగారు.

2014 ఎన్నికల్లో టీడీపీని బంగారు సైకిల్ తో పోల్చావు. చంద్రబాబు నీతిమంతుడన్నావు. ఏమైంది. గత 5 ఏళ్లలో చంద్రబాబు ఏపీకి చేసిందేమీ లేదు. అప్పుడు టీడీపీకి ఓట్లేయించావు. ఇప్పుడు మళ్లీ ప్రజలను మభ్యపెట్టి.. చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నావా? ఏపీ ప్రజలు పవన్ కల్యాణ్ కు, చంద్రబాబుకు బుద్ధి చెబుతారని పృథ్వీ తెలిపారు.

ఇన్ని శుద్ధులు చెప్పే నువ్వు.. మంగళగిరి మాలోకం లోకేశ్ ను ఒక్క మాట కూడా అనడం లేదెందుకు. ఇదేనా నీ రాజకీయం. నువ్వా అవినీతిని ప్రశ్నించేది.. అని పృథ్వీ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మాత్రమే కాదు.. జనసేనను కూడా ప్రజలు భూస్థాపితం చేస్తారు.. అని పృథ్వీ జోస్యం చెప్పారు.