ర‌జ‌నీ బ‌యోపిక్ ప్లాన్ చేస్తున్నారా?

తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. ఈ త‌ర‌హా చిత్రాల‌కు ప్రేక్ష‌కులు పెద్ద‌పీట వేస్తుండ‌టం… ప‌లువురి జీవిత క‌థ‌లు ఆస‌క్తిక‌రంగా వుండ‌టంతో ఆడియ‌న్స్ ఈ త‌ర‌హా చిత్రాల‌పై అమితాస‌క్తిని చూపిస్తున్నారు. మేకర్స్ కూడా వీటినిర్మాణంపై ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తున్నారు. తాజాగా త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ జీవిత కథ‌ని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిసింది.

ఇటీవ‌ల ర‌జ‌నీ ఆరోగ్య కారణాల వ‌ల్ల త‌న రాజ‌కీయ ఎంట్రీని వాయిదా వేస్తున్నాన్న‌ట్టు త‌మిళనాట ఓ హ్యాండ్ మేడ్ లెట‌ర్ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ లెట‌ర్ త‌ను రాసింది కాద‌ని, అయితే అందులో పేర్కొన్న ఆరోగ్య కార‌ణాలు మాత్రం వాస్త‌వ‌మేన‌ని ర‌జ‌నీ సోష‌ల్ మీడియా వేదిక‌గా అంగీక‌రించారు. ర‌జ‌నీ ఆరోగ్య కార‌ణాల నేప‌థ్యంలో ఆయ‌న బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

కండ‌క్ట‌ర్ టు సూప‌ర్‌స్టార్‌గా ఎదిగిన ర‌జ‌నీ ప్ర‌స్థానం నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంద‌ని ఇందులో ర‌జ‌నీగా ఆయ‌న అల్లుడు, హీరో ధ‌నుష్ న‌టించే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయని కోలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ పాత్ర‌లో న‌టించ‌ద‌గ్గ ఏకైక న‌టుడు ధ‌నుష్ మాత్ర‌మేన‌ని ద‌ర్శ‌కుడు లింగు స్వామి కూడా భావిస్తున్నాడ‌ట. ఇందుకు సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే లింగుస్వామి ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.