ఎన్టీఆర్​-కైకాల మాత్రమే సాధించిన ఈ రికార్డు తెలుసా?

-

ఆయన రాజ్యకాంక్షతో రగిలిపోయే సుయోధనుడు, పాపులకు నరకలోక శిక్ష స్మృతిని అమలు చేసే సమవర్తి, కౌరవులను ముప్పతిప్పులు పెట్టిన ఘటోత్కచుడు, పాంచాలి వలువలు వలిచిన దుష్ట దుశ్శాసనుడు, చేతికి ఎముక లేని దాన కర్ణుడు, రామభద్రుని పాదుకలు తలపై మోసిన భరతుడు, సీతమ్మ తల్లిని చెరబట్టిన రావణాసురుడు, వజ్రాలు అక్రమ రవాణా చేసే కరడుకట్టిన స్మగ్లర్‌, వజ్రంలా కఠినంగా కనిపించినా స్నేహానికి ప్రాణమిచ్చే షేర్‌ఖాన్‌, వయస్సు పెరిగినా పరిపక్వత లేని విలన్ కుమారుడు ఇలాంటి పాత్రలు చెప్పగానే వెండితెరపై ఆవిష్కృతమయ్యే ఆ నవరస నటశిఖరమే కైకాల సత్యనారాయణ. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. సీనియర్​ ఎన్టీఆర్​తో ఆయనకు ఉన్న అనుభందం సహా​​ ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం…

ఎన్టీఆర్, సత్యనారాయణ కలిసి నటించిన సినిమాలు అక్షరాలా 100. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ హీరో కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిద్దరిదే అని చెప్పాలి! రాముడు-భీముడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ద్విపాత్రాభినయం కాగా….ఓ పాత్రలో కైకాల సత్యనారాయణే ఎన్టీఆర్​కు డూప్​గా వ్యవహరించారు. పతాక సన్నివేశాల్లో, ఫైట్ సీన్లలో నేరుగా సత్యనారాయణే ఎన్టీఆర్​లా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పోషించటానికి వీలులేని పాత్రలన్నీ సత్యనారాయణ దగ్గరకు రావటం ప్రారంభించాయి. తన కోసం ఇంత కష్టపడుతున్న సత్యనారాయణ.. నటుడిగానూ నిరూపించుకోవాలని ఎన్టీఆర్ తాపత్రయ పడేవారట. అలా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో తన పాత్ర తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలను సత్యనారాయణకు ఇప్పించేవారట.

తామిద్దరి మధ్య కొన్ని సందర్భాల్లో మనస్పర్థలు వచ్చినా…తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ క్షమించమని కోరటం ఎన్టీఆర్ పెద్దరికానికి నిదర్శనం అంటారు సత్యనారాయణ. నిప్పులాంటి మనిషి చిత్రంలో స్నేహమేరా జీవితం పాట.. సినిమా పరంగా ఎలా ఉన్నా వాళ్ల నిజజీవిత అనుబంధానికి అద్దం పడుతుంది. సత్యనారాయణ, ఎన్టీఆర్‌ అన్నయ్య ఒకే ఫ్రేములో ఉంటే ఒక సింహం, ఒక ఏనుగు ఢీకొన్నట్లు ఉండేది.. నన్ను నంబర్‌ వన్‌ విలన్‌వి అని అన్నగారు మెచ్చుకునేవారని చెబుతారు సత్యనారాయణ. ఉమ్మడి కుటుంబం సినిమాలో సెంటిమెంట్‌ పండించే రైతు పాత్రను ఇస్తే.. విలన్‌గా చేసేవాడికి సెంటిమెంట్‌ క్యారక్టరా అన్నవాళ్లు ఉన్నారు. ఆ పాత్రతో ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించి నటుడిగా తనేంటో నిరూపించుకునే అవకాశాన్ని ఎన్టీఆర్ కల్పించారంటూ చాలాసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటారు సత్యనారాయణ. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు…ఆయన పార్టీ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నప్పుడు…ప్రచార ప్రణాళికలు..అధికారం కైవసం చేసుకోవటం ఇలా ప్రతీ సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా సత్యనారాయణ ఎన్టీఆర్​కు తోడుగా నిలిచారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలిచి లోక్ సభకు వెళ్లారు. ఆ మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలవటం వల్ల రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించారు. అలా సత్యనారాయణ కెరీర్​లో ఎన్టీఆర్​ది ప్రత్యేక అనుబంధం.

Read more RELATED
Recommended to you

Latest news