రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా భూభారతి చట్టం పనిచేయాలని శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం నుండి భూమికోసం తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని కానీ నేటికీ భూ సమస్యలు తీరలేదని అన్నారు. ధరణి చట్టంలో అనుభవదారుకాలం తీసివేయడం తో గతంలో అమ్ముకున్నా రైతుల పేరుపై తిరిగి భూమి రావడంతో వారు ఇతరులకు అమ్ముకొని గ్రామాలలో భూ సమస్యలను సృష్టించారని అన్నారు. భూభారతి చట్టంలో తిరిగి అనుభవదారు కాలాన్ని ప్రవేశపెట్టడం శుభపరిణామం అన్నారు.
గతంలో ధరణిలో ఒక సర్వే నెంబర్ లోని కొంత భూమిలో సమస్యలు ఉంటే ఆ సర్వే నెంబర్ లోని పూర్తి విస్తీర్ణాన్ని బ్లాక్ చేయడం జరిగిందని, దీంతో సామాన్య రైతులు తమ అవసరాలకు భూమిని అమ్ముకోకుండా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఇలాంటి సమస్యలు భూభారతిలో పునరావృత్తం కాకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. భూభారతి చట్టం అమలులో అధికారుల పాత్ర ముఖ్యమైనదని అందుకు అనుగుణంగా అధికారులు అంతా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసివేస్తామని చెప్పి ఇచ్చిన హామీ
ప్రకారం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు.