అరే ఈటీవీ ఎన్టీఆర్ బర్త్ డే కి ఎప్పుడూ సింహాద్రీ సినిమా వేస్తావ్ కదరా ఈరోజేంటి సుస్వాగతం వేశావ్ ! ఏయ్ మావా ! ఆహా….అంటూ ఓ నెటిజన్ కామెంట్లు పాస్ చేస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ బర్త్ డే బాగా హైలెట్ చేసేది ఈటీవీనే ! మిగిలిన ఛానెళ్లు ఎన్ని ఉన్నా ఆ ఛానెల్ ప్రత్యేకత ఏంటో తెలిసిందే కదా! ఎన్టీఆర్ కుటుంబానికి ఎంతో ఆప్తులు రామోజీ ! ఆయన పరిచయం చేసిన హీరోనే తారక్. నిన్ను చూడాలని అనే సినిమాతో అరంగేట్రం చేశారాయన. వాస్తవానికి బాల నటుడిగా ఆయన్ను పరిచయం చేసింది మాత్రం మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. ఆ రోజు సహజ కవి మల్లెమాల నిర్మాతగా వ్యవహరిస్తూ తారక రాముడ్ని రామ కథతోనే పరిచయం చేస్తూ బాల రామాయణం తీశారు. గుణ శేఖర్ దర్శకులు ఆ చిత్రానికి.. మాధవపెద్ది సురేశ్ ఆ సినిమాకు సంగీత దర్శకులు. ఆ సినిమా కూడా అప్పుడప్పుడూ ఛానెళ్లలో వస్తుంటుంది. ఆ విధంగా ఆ నాటి బాలుడు ఈ నాటి రాముడు అందరి వాడయ్యాడు. కానీ ఈటీవీ మాత్రం ఇవాళ పవన్ సినిమా ఎందుకని ప్రసారం చేస్తుందో మరి!
ఎపార్ట్ ఫ్రమ్ దిస్ ….
రాజకీయం చూసుకున్నా తారక్ మళ్లీ ఇటుగా వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. తన మనుషులు అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎలానూ వైసీపీలో యాక్టివ్‌గానే ఉన్నారు. వాళ్ల కోసం ఆయన మాట్లాడరు. మాట్లాడలేరు కూడా ! ఇక పార్టీ ఎప్పుడు పిలుపు ఇచ్చినా వచ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని అని చెప్పినా, ఈ సారి తారక్ సాయం కోరుతామని బోండా ఉమామహేశ్వరరావు లాంటి కాపు నేతలు మాట్లాడినా లేదా చెప్పినా అవేవీ ఈ సారి జరిగే పనులు కావు అని కూడా తేలిపోనుంది.ఒకవేళ పసుపు దండు పిలుపు మేరకు తారక్ వచ్చినా తన పనేంటో తాను అన్న విధంగా కేవలం ప్రచారం వరకే పరిమితం అవుతారే తప్ప టిక్కెట్ల గోలలో తలదూర్చరు. ఓ విధంగా ఇప్పటికిప్పుడు టీడీపీకి ఓ స్టార్ క్యాంపైనర్ అవసరం ఉన్నా కూడా అది ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో అన్నది చెప్పలేం. కనుక తారక రాముడు వీలున్నంత మేరకు రాజకీయాలకు దూరంగానే ఉంటారు. అదేవిధంగా సినిమాల విషయమై వేగం పెంచి, వీలున్నంత వరకూ చిన్ని తెర పై కూడా చిద్విలాసం చేయనుండడం ఖాయం.