లవ్ రంజన్ డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్‌తో పాటు రాజశ్రీ ప్రొడక్షన్ చిత్రం సెట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ముంబయి శివారు అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ మైదానంలో పక్క పక్కనే వేసిన రెండు సినిమా సెట్టింగులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. సాయంత్రం 4.30 గంటలకు మొదలైన మంటలు రాత్రి తొమ్మిదిన్నరకు అదుపులోకి వచ్చాయి. ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, అయిదు నీటి జెట్టీలతో సిబ్బంది శ్రమించారు.
ఈ సెట్టింగుల్లో ఒకచోట రాజశ్రీ ప్రొడక్షన్స్ చిత్రం, మరోచోట డైరక్టర్ లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్‌బీర్- శ్రద్ధా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త మూవీ చిత్రీకరణలు జరుగుతుండగా అగ్గి రాజుకొన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనీశ్ దేవాశీ (32) అనే యువకుణ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.