విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ఎపిక్ అడ్వంచర్ థ్రిల్లర్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాందినీ చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించారు. మార్చి 8వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. అఘోరా పాత్రలో విశ్వక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. జీ5 ఓటీటీ వేదికగా ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడలోనూ అందుబాటులోకి రానున్నట్లు జీ5 తాజాగా ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
ఇదీ గామి స్టోరీ : శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా. తనెవరు.. గతమేంటి.. ఎక్కడినుంచి వచ్చాడు.. ఈ జ్ఞాపకాలేం అతడికి గుర్తుండవు. పైగా మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా అతనిని శాపగ్రస్థుడుగా భావించి.. ఆశ్రమం నుంచి వెలివేస్తారు. ఈక్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలుపెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు శంకర్. ఆ తర్వాత ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ333 (మహమ్మద్)ల జ్ఞాపకాలు.. అతడిని ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర ఆసక్తికర అంశాలతో ఇది సిద్ధమైంది.