ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఏఐను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో.. దివంగత గాయకుల గాత్రాన్ని వినిపించడమే కాకుండా దివంగత నటులను మరోసారి తెరపైకి తీసుకొస్తోంది. కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న తాజాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీలో ఏఐను ఉపయోగించనున్నారట. ఏఐ ద్వారా దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్‌ను ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం.
‘ది గోట్’లో ఓ సన్నివేశంలో విజయకాంత్ రూపం తెరపై కనిపించనుందని ఆయన సతీమణి ప్రేమలత చెప్పారు. అనుమతి కోసం వెంకట్ ప్రభు తనని పలుమార్లు విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. విజయ్, అతడి తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ అంటే విజయకాంత్‌కు అభిమానమని అందుకే ఒప్పుకున్నట్లు తెలిపారు. గతంలో ‘వెట్రి’, ‘సెంతూరపండి’ తదితర చిత్రాల్లో విజయకాంత్, విజయ్ కలిసి నటించిన విషయం తెలిసిందే. విజయకాంత్ గతేడాది డిసెంబరులో అనారోగ్యంతో మరణించారు. రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన ‘లాల్ సలాం’ సినిమాలో దివంగత గాయకులు బాంబా బక్యా, షాహుల్ హమీద్‌ల వాయిస్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏఐ సాయంతో వినిపించిన సంగతి తెలిసిందే.