ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ముప్పు ముంచుకొస్తోందని లాన్సెట్ కమిషన్ పేర్కొంది. 2040 నాటికి ఏడాదికి పది లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించే అవకాశం ఉందని తెలిపింది. 2020 నుంచి ఈ వ్యాధి విస్తృతి తీరును సంస్థ విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 75 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్ బారినపడుతున్నట్లు వెల్లడించింది.
‘2020లో ఇటువంటి బాధితుల సంఖ్య 23 లక్షలు కాగా 2040కి 30 లక్షలకు పెరుగుతారు. ముఖ్యంగా పేద, వర్దమాన దేశాల్లో వ్యాధిగ్రస్తుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ధనిక దేశాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆధునిక వసతులు, ప్రజల చైతన్యం వల్ల మరణాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. సకాలంలో చికిత్సలు పొందిన రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో…. ధనిక దేశాల్లో 90 శాతం, భారత్ వంటి వర్దమాన దేశాల్లో 66శాతం, దక్షిణాఫ్రికా వంటి పేద దేశాల్లో 40 శాతం మంది ప్రాణ హాని నుంచి బయటపడుతున్నారు.’ అని నివేదిక రచయిత, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన షాలట్ కోల్జ్ తెలిపారు.