మెగాస్టార్ చిరంజీవిని ఎవరైనా విమర్శిస్తే తనకు చాలా బాధగా ఉంటుందని యంగ్ హీరో కార్తికేయ అన్నారు. సినిమా బాగాలేదు.. నచ్చలేదు అనడం ఓకేగాని.. నటులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరైంది కాదని చెప్పారు. చిరంజీవినే కాదు.. ఎవరినీ అనకూడదని తెలిపారు. తన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012 ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ.. చిరంజీవిపై వస్తున్న ట్రోల్స్ గురించి యాంకర్ అడగ్గా ఓ అభిమానిగా స్పందించారు.
‘‘చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన చూసిన ఒడిదొడుకుల ముందు ఇది చిన్న విషయం. దానికి ఆయన ఫీలవ్వకుండా తదుపరి సినిమాపై దృష్టిపెడతారని నాకు అనిపిస్తుంది’’ అని కార్తికేయ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బెదురులంక 2012 సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన నేహాశెట్టి నటించారు. యుగాంతం ఇతివృత్తంగా ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, ఆటో రామ్‌ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.