రక్షణ’ సినిమాను నాలుగేళ్ల క్రితం చేశానని, ఇప్పుడు తనకు వచ్చిన సక్సెస్ క్యాష్ చేసుకోవడానికి విడుదల ప్లాన్ చేశారని, తనకు ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ పూర్తిగా క్లియర్ చేయలేదని, పైగా ప్రమోషనల్ కార్యక్రమాలకు రావాలని డిమాండ్ చేశారని, రాకపోతే తెలుగు సినిమా నుంచి తనను బ్యాన్ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ‘రక్షణ’ చిత్ర బృందం వాడిన భాష, వ్యవహరించిన తీరు బాలేదని, తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆవిడ హెచ్చరించారు. ఈ వివాదంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఓ లేఖ విడుదల చేసింది.
మార్చిలో 28న పాయల్ రాజ్‌పుత్ మీద ‘రక్షణ’ దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ కంప్లైంట్ ఇచ్చారని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి పేర్కొంది. ప్రచార కార్యక్రమాలకు ఆమె సహకరించడం లేదని, పైగా నాలుగేళ్ల క్రితం సినిమా గనుక ఓటీటీలో విడుదల చేసుకోమని సలహా ఇచ్చిందని ప్రణదీప్ తెలిపినట్టు పేర్కొంది.