టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా RRR . ఇప్పటివరకు ఈ సినిమాకు అధికారికంగా పేరు నిర్ణయం కానప్పటికీ, మొదటి నుండి అందరికీ ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్ అలవాటు అయిపొయింది. ఇక అతి త్వరలో పూర్తి టైటిల్ ప్రకటితం కానున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక పెద్ద అప్ డేట్ రావడం జరిగింది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా డివివి దానయ్య ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లూరిగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఎంపిక కాగా,
నేడు కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ సరసన నటిస్తున్న బ్రిటన్ కు చెందిన నటి ఒలీవియా మోరిస్ ఫస్ట్ లుక్ ను తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అధికారికంగా రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్. నిజానికి గతంలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఎడ్గార్ జోన్స్ ని తీసుకున్నప్పటికీ, అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వలన ఆమె తప్పుకోవడంతో, మరొక నటి కోసం అన్వేషించిన ఆర్ఆర్ఆర్ టీమ్, ఎట్టకేలకు ఒలీవియాను ఎంపిక చేసింది.
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా రాజమౌళి భార్య రమ రాజమౌళి స్టయిలింగ్ అందిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథను అందించడం జరిగింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు….!!