శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టాలను రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి మూడవ వారం లోపు కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్ట్… అన్ని ఆలయాలను కలిపి ఒకే చట్టం కిందికి తీసుకురావడం సరికాదని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం అభిప్రాయపడింది. భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల ఆలయాన్ని ప్రత్యేకంగా చూడాలని కేరళ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. టీటీడీ,గురువయరప్ప ఆలయాల తరహాలో ప్రత్యేక బోర్డు ఉండాలని సుప్రీం కోర్ట్ అభిప్రాయపడింది.
మహిళలకు ఆలయ ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శబరిమల ఆలయ నిర్వహణ పై దాఖలైన పిటీషన్ల విచారణ లో భాగంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో కొత్త చట్టాన్ని కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం… టీటీడీ తరహాలో ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని అయ్యప్పస్వామి దేవాలయానికి కేటాయించాలని, ఇప్పటి వరకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే విధంగా భక్తుల సౌకర్యార్ధం అయ్యప్ప కొండకు బస్సుల సంఖ్యను కూడా పెంచాలని సూచించింది.
ఇదిలా ఉంటే గత ఏడాది సెప్టెంబర్ లో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై పిటీషన్లు దాఖలు అయినా సరే గతంలో ఇచ్చిన తీర్పులో ఏ విధమైన మార్పులు ఉండవని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. శబరిమల ఆలయాన్ని తెరిచిన నేపథ్యంలో ఇప్పుడు ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. పలువురు మహిళలు ఇప్పుడు అయ్యప్పను దర్శించుకోవడానికి గాని ముందుకి రావడంతో అటు కేరళ ప్రభుత్వం కూడా వారికి భద్రత కల్పించలేమని స్పష్టం చేసింది. 12 ఏళ్ళ బాలిక తన తండ్రితో కలిసి అయ్యప్పను దర్శించుకోవడానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు.