బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. హృతిక్ అమ్మమ్మ పద్మా రాణి ఓంప్రకాష్ (91) ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. అయితే కోలుకోలేక శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వయస్సు సంబంధిత సమస్యలకు తోడు తీవ్ర అనారోగ్యంతో పద్మారాణి గత కొన్నేళ్లుగా హృతిక్ తల్లి పింకీ రోషన్ దగ్గరే ఉంటుంది.
కాగా.. దివంగత ఫిల్మ్ మేకర్ జే ఓం ప్రకాష్ భార్యే పద్మ రాణి. ఈ దంపతుల కుమార్తే పింకీ రోషన్. జే ఓం ప్రకాష్ 1974లో కసమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో రాజేష్ కన్నా హీరోగా నటించారు. ఆ తర్వాత హీరో జితేంద్ర తో కలిసి ఓం ప్రకాష్ అనేక చిత్రాల్లో పనిచేశారు. కాగా ఓం ప్రకాష్ 93 ఏళ్ల వయసులో ఆగస్టు 7, 2019 న మరణించారు. ఇప్పుడు ఆయన సతీమణి కూడా కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు హృతీక్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.