ఐదు దశాబ్దాల హిందువుల కల సాకారమయ్యింది. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తండోపతండాలుగా అయోధ్య వెళ్లి బాలరాముడిని దర్శించుకుని వస్తున్నారు. ఇలాంటి క్రమంలో రామ భక్తుడిని అయిన తాను.. అయోధ్య రామాలయంలోనే పెండ్లి చేసుకుంటానని అంటున్నాడు కన్నడ నటుడు అరుణ్ రామ్ గౌడ.
ఐశ్వర్య అనే అమ్మాయితో రామ్ గౌడ దాదాపు పదేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే ఆమెతో పెళ్లి పీటలు ఎక్కాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అది కూడా అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన జనవరి 22వ తేదీనే. అట్టహాసంగా జరిగిన వీరి నిశ్చితార్థానికి శివరాజ్‌కుమార్, ఉపేంద్ర సహా పలువురు కన్నడ నటులు హాజరయ్యారు. రామాలయ ప్రారంభోత్సవం నాడే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రామ్ గౌడను పెండ్లి ఎప్పుడు అని పలువురు అడగ్గా ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. తాను అపర రామ భక్తుడిని అని.. అందుకే అయోధ్య శ్రీరాములవారి సమక్షంలోనే పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు చెప్పాడు.