కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మాగా గుర్తింపు తెచ్చుకున్న వడివేలు స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇదిలా ఉండగా తాజాగా మామన్నన్ అనే సినిమాలో సీరియస్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. దళిత ఎమ్మెల్యేగా వడివేలు నటనకు తమిళ ప్రేక్షకులే కాదు తెలుగు వారు కూడా ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఆయన చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకవైపు వడివేలుపై ప్రముఖ శృంగార తార షకీలా సంచలన వ్యాఖ్యలు చేయడం కోలీవుడ్లో మరింత ఆసక్తికరంగా మారింది.
మొన్నటివరకు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె తాజాగా కుక్ విత్ కోమలి అనే షో నిర్వహిస్తూ ఉండగా ఈ షో ఈమెకు బాగానే పేరు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. తర్వాత యూట్యూబ్ ఛానల్ కోసం షకీలా కొంతమంది నటీనటులను ఇంటర్వ్యూ చేయగా అందులో బాగా పేరు ఉన్నవారు.. చిన్న చిన్న పాత్రలు చేసే నటీనటులు కూడా ఉండడం విశేషం. ఈ క్రమంలోనే ఆ ఇంటర్వ్యూకి కోలీవుడ్ నటి ప్రేమా ప్రియ హాజరయ్యి వడివేలు చేసిన అన్యాయాన్ని గురించి వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ వడివేలుకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు.. నేను ఆయన వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను. మొదట్లో సంతానం, వివేక్, వడివేలు వంటి వారి పక్కన చేసేదాన్ని కానీ తర్వాత నాకు వచ్చిన అవకాశాలను రాకుండా చేశాడు. అయితే ఎందుకు నాపై పగ పెట్టుకున్నారో తెలిసేది కాదు.. ఒక్కొక్కసారి సెట్ కి వచ్చిన తర్వాత కూడా ఆమె వద్దు వేరొకరిని పెట్టుకోండి అని వడివేలు చెబితే మేకర్స్ కూడా నన్ను ఇంటికి పంపేవారు అంటూ ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన షకీలా మీ టు ఫిర్యాదు చేయలేకపోయారా ?అని అడగ్గా మా మధ్య అలాంటి సమస్య లేదు.. కానీ వేరే సమస్య ఉంది.. వడివేలు గురించి ఈ విషయం చెప్పానని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి అని ఆమె చెప్పడంతో ఇది విన్న ప్రతి ఒక్కరు వడివేలు కూడా అలాంటివాడా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.