భారతీయుడు-2 సెట్స్ పై మరణించినవారికి కమల్ హాసన్ రూ.కోటి ఆర్థికసాయం..!

కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2 చిత్ర షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన పేరు కృష్ణ(34). మరో వ్యక్తి ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60). శంకర్ పర్సనల్ అసిస్టెంట్ 28 ఏళ్ల మధు కూడా చనిపోయారు. అలాగే మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో డైరెక్టర్ శంకర్ కూడా ఉన్నారు. శంకర్ కాలు బోన్ ఫ్రాక్చర్ అయింది.

ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే కమల్ అక్కడికి వెళ్లి అందరికీ సాయం చేసాడు. అక్కడే ఉండి గాయపడిన వాళ్లను హాస్పిటల్ తీసుకెళ్లాడు. మ‌రియు సోషల్ మీడియాలో తన సంతాపం వ్యక్తం చేసాడు. ఇప్పటి వరకు మాతో పని చేసిన వాళ్లే ఇప్పుడు లేరని చెప్పడానికి చాలా బాధగా ఉంది.. ఈ ప్రమాదం కన్నీరు పెట్టించేది.. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరక్కూడదని కోరుకుంటున్నానని ట్వీట్ కూడా చేసాడు. ఇక ఇదిలా ఉంటే చనిపోయిన టెక్నీషియన్స్ కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక‌సాయం ప్రకటించాడు కమల్ హాసన్.