నేడు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జరగనున్న కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభకు ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు తమ స్వగ్రామమైన మొగల్తూరులో పెదనాన్న సంస్మరణ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష వరకు కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు వస్తారని అధికారులు అంచనా వేశారు.

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రంగంలోకి దిగింది. కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు వస్తుండటంతో అభిమానులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 11న కన్నుమూశారు. దశ దిన కర్మను అక్కడే పూర్తిచేసిన కుటుంబ సభ్యులు.. ఆయన స్వగ్రామంలో సంస్మరణ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.