తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సమావేశం జరిగింది. ఈ భేటీకి దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సి.కళ్యాణ్, రాఘవేంధ్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శి, హరీశ్ శంకర్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ తదితరులు హాజరయ్యారు.
ఈ భేటీకి సంబంధించి ఎవరికీ తోచిన విధంగా వారు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కీలక సూచనలు చేశారు. సీఎంతో భేటీ అయిన తరువాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయి. సీఎం మీటింగ్ లో అసలు జరగనివి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగింది. 0.5 పర్సెంట్ కూడా నెగిటివ్ లేదు. సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిగేవిధంగా అభివృద్ధి చేద్దామన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సెలబ్రిటీలు పాల్గొనాలని చెప్పారు.