నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా జెర్సీ. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
రెండు ట్రిపుల్ సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు, 36 సెంచరీలతో 1979-86 వరకు రంజీ క్రికెట్‌లో తిరుగులేని ఆటగాడిగా పేరుతెచ్చుకుంటాడు అర్జున్(నాని). మతాలు వేరైనా అభిరుచులు, వ్యక్తిత్వాలు కలవడంతో పెద్దలను ఎదురించి సారాను పెళ్లిచేసుకుంటాడు అర్జున్.జాతీయ జట్టు తరుపున ఆడాలనే అర్జున్ కల నెరవేరకపోవడంతో క్రికెట్‌కు దూరమవుతాడు. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో భార్యతో సంతోషంగా బతకాలని అనుకుంటాడు. కానీ చేయని తప్పు అతడి జీవితాల్ని తలక్రిందులు చేస్తుంది. ఉద్యోగం కోల్పోవడంతో అతడు అనుకున్నట్లుగా జీవితం సాగదు. అప్పులు చేసి బతుకుతూ అందరి దృష్టిలో పనికిరానివాడిగా ముద్రపడిపోతాడు అర్జున్. చివరకు ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య కూడా అతడిని ద్వేషిస్తుంటుంది. అయితే కొడుకు నానితో పాటు కోచ్ మూర్తి మాత్రం అర్జున్ వెన్నంటి నిలుస్తారు. కొడుకు దృష్టిలో ఓడిపోకూడదని జీవితాన్ని పణంగా పెట్టి 36 ఏళ్ల వయసులో మళ్లీ అర్జున్ క్రికెట్ ఆడటం మొదలుపెడతాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేమిటి? ఎలా విజేతగా నిలిచాడు? జాతీయ జట్టుకు ఆడాలనే అర్జున్ కల నెరవేరిందా?లేదా? అన్నదే మిగతా కథ.
క్రికెట్‌లోనే కాదు జీవితంలో గెలిచిన ఓ ఆటగాడి కథ ఇది. ప్రపంచం దృష్టిలో పరాజితుడిగా ముద్రపడిన ఓ క్రికెటర్ ఎలా విజేతగా నిలిచాడనే అంశాన్ని తెరపై అర్థవంతంగా చూపించారు దర్శకుడు. పదేళ్ల పాటు క్రికెట్ ఆటకు దూరమై నిత్యం సమస్యలతో సతమతమవుతూ ఉండే సాధారాణ వ్యక్తి స్ఫూర్తిదాయక ప్రయాణమే ఈ సినిమా. గొప్ప ఆటగాడి పేరుతెచ్చుకున్న ఓ క్రికెటర్ పదేళ్ల తర్వాత ఏలా జీరోగా మారిపోయాడు తన లక్ష్యాన్ని ఎలా వెతుక్కుంటూ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాడో దర్శకుడు గౌతమ తిన్ననూరి తెరపై హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
కొడుకు ప్రేమ కోసం తపించే తండ్రిగా నాని పడే ఆరాటాన్ని ప్రథమార్థంలో చక్కగా చూపించారు. ఐదు వందల రూపాయల ఖరీదైన ఓ జెర్సీ కొనివ్వలేక అతడు పడే సంఘర్షణతో కథను హృద్యంగా నడిపించారు. తండ్రీకొడుకుల అనుబంధంతో ప్రథమార్థంలో వచ్చే ప్రతి సన్నివేశం సినిమాను నిలబెడుతుంది. అలాగే ప్రేమించిన భార్య ధ్వేషిస్తున్న ఆమెపై ఇష్టాన్ని చంపుకోలేని భర్త ప్రేమను సహజంగా చూపించారు. ఆ సన్నివేశాలు దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి ప్రతిభకు అద్దంపడతాయి. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీని తీసుకోకుండా వాస్తవికతను దగ్గరగా అల్లుకున్నారు. గాఢమైన ఎమోషన్స్ ఉన్న ఆ సన్నివేశాల్లోనే వినోదాన్ని సృష్టించుకున్న తీరు బాగుంది. ఐదు వందల రూపాయల అప్పు కోసం స్నేహితుడి ఇంటికి వెళితే ఎదురయ్యే పరాభావాలు నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేస్తాయి.
కొడుకు కోసం తిరిగి క్రికెట్ ఆడాటని నిర్ణయించుకున్న అర్జున్ ఎదుర్కొనే సంఘర్షణను సంభాషణల కంటే సన్నివేశాల ద్వారా చూపించిన విధానం బాగుంది. తనకంటే వయసులో చిన్నవారితో క్రికెట్ ఆడే క్రమంలో అతడు పడే వేదన, లక్ష్యం కోసం చేసే త్యాగాలన్నింటిని కథానుగుణంగా నడిపించారు. విరామం వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిన కథకు ద్వితీయార్థంలో కొంత బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. అర్జున్ బ్యాంటింగ్ పరాక్రమాన్ని చూపించడానికే దర్శకుడు ఎక్కువగా సమయాన్ని కేటాయించారు. ఆ సన్నివేశాలన్నీ క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూస్తున్న అనుభూతిని లోనుచేస్తాయి. క్రికెట్‌పై ఎక్కువ దృష్టిపెట్టి మిగతా ఎమోషన్స్‌ను కొంత విస్మరించారు.
వెండితెరపై ప్రతి కథలో ఎన్ని సవాళ్లు ఎదురైన హీరోనే గెలుస్తాడు. అది సహజమే. ఇందులో అలాగే చూపిస్తారని అనుకున్న ప్రేక్షకుడికి పతాక ఘట్టాలో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఆ మలుపును విభిన్నంగా ఆవిష్కరించారు దర్శకుడు. జెర్సీ అనే టైటిల్ పెట్టడానికి ఉన్న బలమైన కారణమేమిటో పతాక ఘట్టాల ద్వారా కన్వీన్సింగ్‌గా చూపించారు.
ఎలా ఉందంటే :
మళ్లీ రావా సినిమాతో దర్శకుడిగ ప్రతిభ చాటుకున్న గౌతం జెర్సీ సినిమతో మరోసారి తన సత్తా చాటాడు. ఎంచుకున్న కథని చాలా ఎమోషనల్ గా నడిపించాడు దర్శకుడు. అర్జున్ పాత్రని ఓన్ చేసుకుని తనలో మనల్ని చూసుకునేలా డైరక్టర్ తన ప్రతిభ కనబరిచాడు. నాని తప్ప మరెవరు ఈ పాత్రకు సూట్ అవరన్నట్టుగా నాని నటన ఉంది.
ఫస్ట్ హాఫ్ మొదలు పెట్టడం కాస్త నెమ్మదిగా మొదలు పెట్టినా ఇంటర్వల్ సీన్ అదిరిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా స్లో గా నడిచినట్టు అనిపించినా మళ్లీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాను నిలబెడతాయి. ఫైనల్ గా నాని జెర్సీ ఓ ఎమోషనల్ డ్రామా. కచ్చితంగా ప్రతి ఒక్కరు సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది.
ఎలా చేశారు :
నాని జెర్సీలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. అర్జున్ పాత్రలో నాని నటన.. చాలా నిజాయితీగా అనిపిస్తుంది. నాని నాచురల్ స్టార్ ఎందుకు అయ్యాడో జెర్సీ చూస్తే తెలుస్తుంది. ఇక శ్రద్ధ శ్రీనాథ్ కూడా బాగా చేసింది. సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంది. ఇక సత్యరాజ్ పాత్ర చాలా ఇంప్రెస్ చేస్తుంది. సుబ్బరాజు, ప్రవీన్, రాహుల్ రామకృష్ణ వీరంతా సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు.
ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సను సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. ఒరిజినల్ క్రికెట్ చూస్తున్నట్టుగా కెమెరా వర్క్ ఉంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. కథ, కథనాలు దర్శకుడు గౌతం తిన్ననూరి ఎమోషనల్ గా సాగించాడు. తెలుగు పరిశ్రమలో ఇతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నాని నటన
క్లైమాక్స్ సీన్స్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్క కొద్దిగా ల్యాగ్ అవడం
బాటం లైన్ :
నాని జెర్సీ.. ఇది ప్రతి ఒక్కరి కథ..!
రేటింగ్ : 3.5/5