మాస్క్ లేకుండా బుట్ట‌బొమ్మ హ‌ల్‌చ‌ల్‌!

క‌రోనా వైర‌స్ స్పెయిన్‌ని ఓ ఊపు ఊపేస్తున్న వేళ `రాధేశ్యామ్‌` టీమ్‌తో జార్జీయా వెళ్లి అక్క‌డ ‌ఎలాంటి బెరుకు లేకుండా షూటింగ్ చేసిన ముంబై చిన్న‌ది పూజా హెగ్డే. గ‌త ఆరు నెల‌లుగా షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో చాలా వ‌ర‌కు సినిమాల షూటింగ్‌ల‌న్నీ మ‌ధ్య‌లోనే నిలిచిపోయాయి. తాజాగా మ‌ళ్లీ షూటింగ్‌ల సంద‌డి చిన్న చిన్న‌గా మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలో అక్కినేని అఖిల్ న‌టిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` షూటింగ్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టిస్తోంది.  క‌రోనా భ‌యం ఇంకా స్టార్స్‌ని వెంటాడుతున్న వేళ ఈ మూవీ సెట్‌లో పూజా హెగ్డే ఎలాంటి మాస్క్ లేకుండా సంద‌డి చేస్తున్న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ మూవీ కోసం తాజాగా ముంబై ని వీడి హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన పూజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సెట్లో హంగామా చేయ‌డం మ‌ద‌లుపెట్టింది.

కార‌వాన్ వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తిగ‌త సిబ్బంది పీపీఈ కిట్‌లు ధ‌రించి వుంటే పూజా మాత్రం మాస్కు కూడా లేకుండా సంద‌డి చేస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.