Prabhas : కెరీర్‌పైనే ప్రభాస్ ఫుల్ ఫోకస్.. ‘ఆదిపురుష్’ కోసం కఠిన శిక్షణ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల విడుదలైంది. అయితే, ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో ప్రభాస్ అభిమానులు అప్ సెట్ అయ్యారు. అంచనాలు తలకిందులైనప్పటికీ సినిమాలో ప్రభాస్ నటన పరంగా చాలా కష్టపడ్డారని, పాత్రకు తగ్గట్లు హావభావాలు పలికారని అంటున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన ఫుల్ ఫోకస్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రాల్లో పాత్రలకు తగ్గట్లు ప్రిపేర్ అవుతున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు ప్రభాస్. రాముడి పాత్రలో ప్రభాస్ కనబడనున్నారు. శరీరాకృతి కోసం ప్రభాస్ ఫుల్ ఫోకస్ పెట్టారని ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ పేర్కొన్నారు.

అవతార పురుషుడు, ఆరాధ్య దేవుడు, ఆది పురుషుడు అయిన రాముడి గుణగణాలు, పరాక్రమం వెండితెరపైన అత్యద్భుతంగా ఆవిష్కృతం చేసేందుకు ‘ఆదిపురుష్’ టీం పని చేస్తోంది. ఈ క్రమంలోనే పాత్ర కోసం ప్రభాస్ విలువిద్యను నేర్చుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు వ్యాయామాలూ చేస్తున్నారు. సంస్కృతం, హిందీ భాషలను నేర్చుకుంటున్నారు. ఉచ్ఛరణ స్పష్టంగా ఉండేందుకు సాధన చేస్తున్నారు.

రాముడి పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రభాస్ తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారని, రాముడు అంటే ప్రభాస్ అన్న మాదిరిగా ఉంటారని దర్శకుడు ఓం రౌత్ చెప్తున్నారు. ఇందులో సీత పాత్రను కృతి సనన్ పోషిస్తుండగా, ప్రతి కథా నాయకుడు రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 10న ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.