టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా మారుతి డైరక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం చిత్ర బృందం గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో మరో విషయం ఈ మూవీకి హైలెట్ గా మారనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇందులో గెస్ట్ గా కనిపించనున్నట్లు సమాచారం.
ప్రముఖ దర్శకుడు మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఇప్పటికే దాదాపు 45 రోజులు షూటింగ్ పూర్తి చేసుకుంది.. అన్నపూర్ణ 7 యాక్టర్స్ స్టూడియోలో ఒక 19వ శతాబ్దానికి చెందిన బిల్డింగ్ సెట్ కూడా నిర్మించి షూట్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాలో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సినిమాలో మాత్రం ఓ గెస్ట్ రోల్ ప్రత్యేకంగా నిలవనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రోల్ గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చిత్ర బృందం సంప్రదించిందని అందుకు వర్మ కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆ పాత్రని రిలీజ్ వరకూ రివీల్ చేయకూడదని టీమ్ డిసైడ్ అయ్యిందిట. ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ గెస్ట్ అప్పియరెన్స్ కనిపించి అభిమానులకు షాక్ ఇవ్వనున్నట్టే తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ తాతగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. తాత మనవళ్ల బంధం ఈ సినిమాలో కీలకంగా మారినట్టు కూడా తెలుస్తుంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ సినిమాలు కూడా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఏడాది చివరలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రాబోతున్నట్టు సమాచారం.