బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో టీసిరీస్ నిర్మించిన చిత్రం యానిమల్. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబి డియోల్, తెలుగు నటులు బబ్లు పృథ్విరాజ్, మాగంటి శ్రీనాథ్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని.. భారీ వసూళ్లు కూడా రాబడుతోంది.
అయితే..’యానిమల్’ సినిమాలో తాను పోషించిన గీతాంజలి పాత్ర తనకి ఎంతో నచ్చిందని రష్మిక తెలిపారు. “మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే వర్ణించలేనంత ఆనందంగా ఉంది. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఒక నటిగా నాకు గీతాంజలి పాత్ర ఎంతో నచ్చింది. ఆ పాత్రలో నటించిన ప్రతి సీన్ ను నేను ఎంజాయ్ చేశా. చిత్రీకరణలో మూవీ టీం తో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి” అని చెప్పారు.