సంక్రాంతి రేసుకి మాస్ మ‌హారాజా రెడీ!

ఏడు నెల‌ల త‌రువాత ఆగిపోయిన సినిమాల షూటింగ్‌లు మ‌ళ్లీ స్పీడందుకున్న విష‌యం తెలిసిందే. దీంతో సంక్రాంతి బ‌రిలో పెద్ద లిస్టే రెడీ అవుతోంది. డిసెంబ‌ర్ వ‌ర‌కు షూటింగ్ పూర్తి కానున్న సినిమాల్లో అత్య‌ధిక శాతం సంక్రాంతి బ‌రిలో దిగాల‌ని స్టార్ హీరోలు పోటీప‌డుతున్నారు. ఈ పోటీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా దిగ‌బోతున్నారు.

ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. డాన్ శీను, బ‌లుపు చిత్రాల త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీగానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. పాట మిన‌హా టాకీ పూర్త‌యింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నారు.

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ లేడీ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ మూవీని ముందు ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్‌ని జీటీవితో పాటు జీ5కి ఇవ్వాల‌నుకున్నార‌ట‌. కానీ తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ని జీ టీవికి ఇవ్వ‌డం లేద‌ని, మ‌రో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్‌కి ఇవ్వ‌బోతున్నార‌ని తెలిసింది.