చిత్రం : అనుకున్నది ఒకటి అయినది ఒకటి
నటీనటులు : ధన్యా బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, సిద్ది ఇద్నానీ, త్రిధా చౌదరి తదితరులు
దర్శకత్వం : బాలు అడుసుమిల్లి
నిర్మాత : హిమ వెలగపూడి, వేగి శ్రీనివాస్
బ్యానర్ : బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్
మ్యూజిక్ : వికాస్ బడిజా
సినిమాటోగ్రఫి : శేఖర్ గంగనమోని
ఎడిటింగ్ : మణికాంత్
రిలీజ్ డేట్ : 2020-03-06
రేటింగ్ : 1/5
ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ది ఇద్నానీ కోమలీ ప్రసాద్ వంటి నటీమణులను ప్రధాన ప్రాతలుగా పెట్టిన తీసిన చిత్రం అనుకున్నది ఒకటి అయినది ఒకటి. స్వతంత్ర భావాలు కలిగి, స్వేచ్చగా బతికే ఓ నలుగురు అమ్మాయిల కథ అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే మరి ఈ రకమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో ఓ సారి చూద్దాం.
కథ
ఆఫీస్‌లో పనితో ఫ్రస్ట్రేట్ అయ్యే ధన్యా (ధన్యా బాలకృష్ణ), కోమలీ (కోమలీ ప్రసాద్), త్రిధా (త్రిధా చౌదరి)లు మంచి స్నేహితులు. వీరంతా ఒకే చోట ఉంటారు. వీరికి మరో స్నేహితురాలు సిద్ది (సిద్ది ఇద్నానీ). తమ స్నేహితురాలి పెళ్లి కోసం ఈ నలుగురు గోవాకు బయల్దేరుతారు. అక్కడ వీరికి ఎదురైన సంఘటనలేంటి? హత్య ఎందుకు చేయాల్సి వస్తుంది? వీరిని బ్లాక్ మెయిల్ చేసిందెవరు? అసలు చివరకు ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే అనుకున్నది ఒకటి అయినది ఒకటి.
నటీనటులు
అనుకున్నది ఒకటి అయినది ఒకటిలో నలుగురు పాత్రలో ప్రధానమైనవి. టీవీ యాంకర్‌గా పని చేసే త్రిధా, క్యాస్టూమ్ డిజైనర్ అయిన కోమలి, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయిన ధన్యా తమ పాత్రల్లో బాగానే నటించారు. పెళ్లి చేసుకుని అసంతృప్తితో కాపురం చేసే క్యారెక్టర్లో సిద్ది ఇద్నానీ నటించింది. వీరందరిలోకెల్లా ధన్యా, సిద్ది ఇద్నానీ తెరపై అందంగా కనిపిస్తారు. నటనలో మాత్రం కోమలి ప్రసాద్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. మిగిలిన పాత్రల్లో పోలీసాఫీసర్‌గా సమీర్, టిక్ టాక్ ఫేమ్ సృజనగా హిమజ, బెల్ బాయ్‌గా జాక్ పాత్రలో ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
అనుకున్నది ఒకటి అయినది ఒకటి సినిమా చూస్తున్నంత సేపు.. ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది. దర్శకుడు అనుకున్నది ఒకటి తీసింది ఒకటి అని అనిపించేలా ఉంది. కొద్దిసేపు క్రైమ్‌లా అనిపించినా.. మరికొద్ది సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించినా పర్లేదు కానీ.. ఎటు కాకుండా అన్నింటిలోనూ బోల్డ్ డైలాగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టి కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. దీంతో ఏ ఎమోషన్‌కు కనెక్ట్ కావాలో ప్రేక్షకుడికి కూడా అర్థం కాదు. ఒకానొక దశలో ఈ సినిమాలో కథ ఉందా? అనే అనుమానం వచ్చినా అది ప్రేక్షకుడు తప్పుకాదు. ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది.
బోల్డ్ డైలాగ్స్, హీరోయిన్స్ సిగరెట్స్ తాగడం, మందు కొట్టే సీన్లతోనే ప్రథమార్థం నింపేసినట్టు కనిపిస్తోంది. ఇక ద్వితీయార్థంలో కథనం మొత్తం గాడి తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. కథ ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఎవ్వరికీ అర్థం కాకుండా అంతా గందరగోళంగా మారినట్టు అనిపిస్తోంది. ద్వితీయార్థంపై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేదేమో.
వికాస్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాకు ఉపయోగపడలేదు. శృతిమించినట్టు అనిపించే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఓ దశలో ప్రేక్షకుడికి చిరాకు పెట్టింవచ్చు. శేఖర్ గంగనమోని తన కెమెరా పనితనంలో నలుగురిని అందంగానే చూపించాడు. మణికాంత్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
చివరగా.. టైటిల్‌కు న్యాయం జరిగింది