సాయి పల్లవి.. ‘ఫిదా’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది.
సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనుకోని అతిథి’. మలయాళం ఘన విజయం సాధించిన ‘అధిరన్’కు తెలుగు అనువాదం. నవంబర్ 15న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు” అని అన్నారు.
అంతేకాక ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది అనేది సమాచారం. సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది.