సామ్‌‌ వుంటే చాలా కంటెంట్ అక్క‌ర్లేదా?

రియాలిటీ షోలు భారీ స్థాయిలో టీఆర్పీని ద‌క్కించుకుంటున్న విష‌యం తెలిసిందే. సినిమాలు, వెబ్ సిరీస్‌ల కంటే రియాలిటీ షోల‌తో భారీ స్థాయిలో వీవ‌ర్స్‌ని పెంచుకోవాల‌ని త‌ద్వారా ఓటీటీల్లో భారీ స్థాయిలో స‌బ‌స్క్రైబ‌ర్స్‌ని సొంతం చేసుకున్న ఓటీటీగా ఓ వెలుగు వెలిగిపోవాల‌ని `ఆహా` కోసం అల్లు అర‌వింద్ అండ్ అల్లు అర్జున్ టీమ్ ప్లాన్ చేసింది. ఇందు కోసం కింగ్ నాగార్జున కోడ‌లు స్టార్ హీరోయిన్ స‌మంత‌ని రంగంలోకి దింపింది.

స‌మంత హోస్ట్ గా ఇటీవ‌ల ద‌స‌రా సంద‌ర్భంగా బిగ్‌బాస్ షోని నిర్వ‌హించి స‌క్సెస్ కావ‌డంతో అదే స్థాయిలో తాము రూపొందించిన `సామ్ జామ్ స‌మంత‌` పేరుతో రియాలిటీ షోని ప్రారంభించారు. బ‌తుకు జ‌ట్కా బండి, అలీతో స‌ర‌దాగా, క్యాష్‌.. వంటి రియాలిటీ షోస్‌ని మిక్స్ చేసి ఈ షోగా మార్చారు. అయితే ఇందులో కంటెంట్ త‌క్కువ క‌ల‌రింగ్ ఎక్కువ‌. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌, త‌మ‌న్నా, సైనా నెహ్వాల్ జంట‌ల‌పై టాక్ షోని షూట్ చేశారు.

ఈ నెల 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ మొద‌లుపెట్టారు. తొలి ఎపిసోడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించాడు. తొలి ఎపిసోడ్ ఓ రేంజ్‌లో వుంటుంద‌ని అంతా ఊహించారు. కానీ శ‌నివారం బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో అఖిల్‌ని ఏడిపించి.. భ‌యాందోళ‌న‌కు గురిచేసి చివ‌రికి ఫేక్ ఎలిమినేష‌న్ అంటూ నాగ్ ఉసూనుమ‌నిపించిన‌ట్టే సామ్ జామ్ ఫ‌స్ట్ ఎపిసోడ్ కూడా అదే స్థాయిలో విజ‌య్‌దేవ‌ర‌కొండ లాంటి ఆట‌మ్ బాంబ్ వున్నా కూడా తుస్సుమ‌నిపించడంతో షో ఫ్లాప్ అనే టాక్ వినిపిస్తోంది. స‌మంత వుంటే చాలా కంటెంట్ అక్క‌ర్లేదా? అని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ‌