ఈ హీరోయిన్లు క్లిక్‌మనిపిస్తే… అద్భుతాలే

నచ్చిన చోటికెళ్తే సెల్ఫీ క్లిక్‌మన.. ఆహ్లాదకరమైన ప్రదేశం కనిపిస్తే కెమెరాలో బంధిస్తాం.. ఇలా కంటికి ఇంపుగా కనిపించే ప్రతిదాన్నీ ఫొటోలో బంధించడం మనకు అలవాటే! అయితే ఇటు తమ వృత్తుల్లో బిజీగా ఉంటూనే.. అటు ఫొటోగ్రఫీపై ఇష్టంతో దాన్ని ప్రవృత్తిగా మార్చుకునే వాళ్లు కొందరుంటారు. ఈ జాబితాలో సామాన్యులే కాదు.. కొందరు సెలబ్రిటీలూ ఉన్నారు. వీరిలో పనిగట్టుకొని ఫొటోగ్రఫీ నైపుణ్యాలు పెంపొందించుకున్న వాళ్లు కొందరైతే.. సెకండ్ ఇన్నింగ్స్‌గా దీన్ని ఎంచుకున్న వారు మరికొందరున్నారు. మరి, ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు? ‘ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

దియా మీర్జా ఈ చక్కనమ్మ అటు వృత్తికి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో.. ఇటు వ్యక్తిగత జీవితాన్నీ అంతగానే ఆస్వాదిస్తుంటుంది. మనలోని ఆసక్తులకు పదును పెట్టినప్పుడే మనల్ని మనం మిస్సవ్వకుండా, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేయచ్చంటోంది దియా. మరి, నటన కాకుండా వ్యక్తిగతంగా ఏ అంశంపై ఎక్కువగా దృష్టి పెడతారని అడిగితే.. ఫొటోగ్రఫీనే అని చెబుతోంది. ‘ఫొటోగ్రఫీ నా తపన. నాలోని ప్రతికూల ఆలోచనలు, మానసిక ఒత్తిళ్లను దూరం చేసే ఔషధం!’ అని చెప్పే ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. ఎక్కువగా పచ్చటి ప్రకృతిని, వన్యప్రాణుల్ని తన కెమెరాలో బంధిస్తుంటుంది. ఏ వెకేషన్‌కి వెళ్లినా తన మనసుకు ఆహ్లాదాన్ని పంచే ఈ రెండు అంశాల్ని క్లిక్‌మనిపించి.. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటుంది కూడా! నటిగా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సినీ ప్రియుల మనసు దోచుకున్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. మరోవైపు ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ’ కార్యక్రమానికి (UNEP) జాతీయ రాయబారిగానూ వ్యవహరిస్తోందీ బాలీవుడ్‌ బ్యూటీ.

రవీనా టాండన్ మక్కువతో ఫొటోగ్రఫీని తన ప్రవృత్తిగా ఎంచుకుంది బాలీవుడ్‌ సీనియర్‌ నటి రవీనా టాండన్‌. అయితే తాను తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాకే పరిమితం కాకుండా.. ఎగ్జిబిషన్లు, ఆర్ట్‌ గ్యాలరీల్లోనూ ప్రదర్శితం కావడం విశేషం. మరి, ఎక్కువగా ఎలాంటి చిత్రాలు కెమెరాలో బంధించడానికి ఇష్టపడతారని అడిగితే.. వన్యప్రాణుల్ని, అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్‌ చేయడమంటే మక్కువంటోందీ బాలీవుడ్‌ అందం.

‘మనసుకు నచ్చిన పని చేయడంలోనే ఏదో తెలియని ఆనందముంటుంది. ఫొటోగ్రఫీ నా తపన.. నాకెంతో ఇష్టమైన వన్యప్రాణుల్ని, ఆ వాతావరణాన్ని.. కెమెరాలో బంధించడమంటే ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంటుంది..’ అంటూ మాటల్లో తన మక్కువను చాటుకునే రవీనా.. తన ఫొటోగ్రఫీ నైపుణ్యాలతో పలు సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటుంది.

అంతేకాదు.. మొన్నామధ్య మధ్యప్రదేశ్‌లోని బంధావ్‌ఘర్‌ నేషనల్‌ పార్క్‌లో తన భర్త, కూతురితో కలిసి పర్యటించిన రవీనా.. అక్కడి వన్యప్రాణుల్ని తన కెమెరాలో బంధించి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. అలాగే తాను తీసిన కొన్ని ఫొటోలు ముంబయిలోని ‘జహంగీర్‌ ఆర్ట్‌ గ్యాలరీ’లోనూ ప్రదర్శితమయ్యాయి.

రవీనా ఠండన్
రవీనా ఠండన్

రిచా చద్దా కొంతమంది తమలో ఉన్న తపనను ఎంజాయ్‌ చేయడమే కాదు.. అమితంగా ఆరాధిస్తుంటారు కూడా! బాలీవుడ్‌ భామ రిచా చద్దా అదే కోవకు చెందుతుంది. ఫొటోగ్రఫీ అంటే ప్రాణం పెట్టే ఈ చక్కనమ్మ.. ఇందులో నైపుణ్యాలు నేర్చుకునే క్రమంలో ఏకంగా ఫిల్మ్ ఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరానే కొన్నానంటోంది. ‘ఫొటోగ్రఫీ అంటే నాకు చిన్నప్పట్నుంచే ఇష్టం. నేను చదువుకునే రోజుల్లో ఫొటోగ్రఫీపై ఉపన్యాసాలు కూడా ఇచ్చేదాన్ని. ఇప్పటికీ ఎక్కడికెళ్లినా, ఎంత బిజీగా ఉన్నా నచ్చిన ప్రదేశాల్ని, వస్తువుల్ని నా ఎస్‌ఎల్‌ఆర్‌ లో బంధించకుండా ఉండలేను..’ అంటూ ఓ సందర్భంలో పంచుకుంది రిచా.

 

విద్యా బాలన్ ఫొటోగ్రఫీ తనకెంతో ఆనందాన్ని, తన మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుందంటోంది బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌. ‘సలామ్‌-ఎ-ఇష్క్‌’ సినిమా షూటింగ్‌ సమయం నుంచే ఫొటోగ్రఫీపై ఇష్టం పెరిగిందంటోన్న విద్య.. దేశవిదేశాల్లో వెకేషన్లకు, షూటింగ్స్‌కి ఎక్కడికి వెళ్లినా అక్కడి అందమైన ఫొటోల్ని కెమెరాలో బంధించకుండా తిరిగి రాదట! ముందు ఫోన్లో ఉన్న కెమెరాతో తన ఫొటోగ్రఫీ మక్కువను తీర్చుకున్న విద్య.. ఆ తర్వాత ఓ ఖరీదైన డిజిటల్‌ కెమెరా కొనుగోలు చేసిందట! తన ఫొటోషూట్స్‌ అన్నీ ఆ కెమెరాతోనే తీయించుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాదు.. ఫొటోగ్రఫీ గురించి ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటుందీ బాలీవుడ్‌ అందం.

‘ఫొటోగ్రఫీపై నాకున్న ఆసక్తిని గమనించిన నా స్నేహితులు.. ‘నువ్వు ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా ఎందుకు మారకూడదు?’ అని! ఎప్పుడూ నాతో ఓ మాట అంటుంటారు. అది నిజమేననుకోవచ్చు.. కానీ ఇప్పుడు నా దృష్టంతా సినిమాలు, కెరీర్‌ మీదే ఉంది. చూద్దాం.. దానికీ టైమొస్తుందేమో?!’ అంటూ మాటల్లోనే తన మక్కువను చాటుకుంది ఫొటోగ్రఫీ లవర్.

వహీదా రెహ్మాన్ ఇలా నేటి తరం, నిన్నటి తరం నాయికలే కాదు.. అలనాటి అందాల తార వహీదా రెహ్మాన్‌ కూడా ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడతానంటున్నారు. ప్రస్తుతం 84 ఏళ్ల వయసున్న ఆమె.. సినిమాల నుంచి రిటైరయ్యాక తన సెకండ్ ఇన్నింగ్స్‌గా ఫొటోగ్రఫీ నైపుణ్యాలు నేర్చుకోవడంపై శ్రద్ధ పెట్టారు. ఇక ఎక్కడికెళ్లినా, తనకు నచ్చిన ఏ వస్తువు కంటపడినా దాన్ని ఫొటోలో బంధించకుండా ఉండలేనంటోన్న వహీదా.. తన ఈ నైపుణ్యాలతో గతంలో ఓ సామాజిక కార్యక్రమంలోనూ భాగమయ్యారు.

‘ఒకప్పుడు ఫొటోగ్రఫీ నైపుణ్యాలు నేర్చుకుందామంటే ప్రత్యేకంగా స్కూలు, బోధించే టీచర్లు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నం. తపన, ఓపిక ఉంటే చాలు.. వయసుతో సంబంధం లేకుండా ఏదైనా నేర్చేసుకోవచ్చు. ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన ఫొటోలు తీయాలంటే ఎంతో ఓపిక కావాలి. సాధన చేస్తున్న కొద్దీ ఇదీ అసాధ్యమేమీ కాదు..’ అంటున్నారు వహీదా.

ఇక దివంగత లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ కూడా ఫొటోగ్రఫీ అంటే తనకు ప్రాణమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇలా రియల్‌ లైఫ్‌లోనే కాదు.. రీల్‌ లైఫ్‌లోనూ ఫొటోగ్రాఫర్‌గా పాత్రలు పోషించిన నాయికలూ ఉన్నారు. తద్వారా తమలోని మక్కువను చాటుకోవడంతో పాటు.. ఆయా పాత్రలకూ ప్రాణం పోశారు.