ఘట్టమనేని కృష్ణ.. సూపర్ స్టార్ వారసుడిగా చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ రాజకుమారుడు సినిమాతో హీరోగా కెరియర్ మొదలుపెట్టాడు. ఆ సినిమాలో మహేష్ నటన అందరిని మెప్పించింది. ఇక అప్పటి నుండి భరత్ అనే నేను వరకు చేసింది 24 సినిమాలే అయినా మహేష్ హీరోగా తన మార్క్ చూపిస్తూ టాలీవుడ్ నెంబర్ 1 హీరో స్థానం దక్కించుకునే సత్తా చాటాడు.
సినిమా సినిమాకు కొత్తదనంతో పాటుగా ప్రయోగాలకు ఎప్పుడు సిద్ధమే అనేలా ఉండే మహేష్ సాహసమే ఈరోజు ఆయన్ను సూపర్ స్టార్ ను చేసిందని చెప్పొచ్చు. జూలై 30, 1999లో మహేష్ హీరోగా వచ్చిన రాజకుమారుడు రిలీజ్ అయ్యింది. నేటికి మహేష్ 19 ఏళ్లు కెరియర్ పూర్తయింది. 19 ఏళ్లలో చేసింది 24 సినిమాలే అయినా మహేష్ కెరియర్ లో ఎన్నో రికార్డులు ఉన్నాయి.
ముఖ్యంగా తెలుగు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ పెంచింది మహేష్ సినిమాలే అని తెలిసిందే. అక్కడ 1 మిలియన్ మార్క్ అందుకున్న మొదటి సినిమా మహేష్ బాబుదే. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మహేష్ ఏరియా వైజ్ రికార్డులు ఉన్నాయి. ఇక రివార్డుల సంగతి లెక్కకు మించే ఉన్నాయి. మొత్తానికి 19 సంవత్సరాలు హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ సినిమాల సంఖ్య మరింత పెరిగి మరిన్ని సూపర్ హిట్లు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.