‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఈరోజు ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. సినిమా విడుదల కాకపోవడంతో రూ.కోట్లలో నష్టం వచ్చిందని నిర్మాత తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణను సింగిల్ బెంచ్ ఈనెల 11వ తేదీకి వాయిదా వేసిందని కోర్టుకు తెలిపారు. స్పందించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.
‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు వ్యూహం సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆంక్షలు విధిస్తూ ఓటీటీ, ఆన్‌లైన్, ఇంటర్నెట్ వేదికల్లో విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా రామదూత క్రియేషన్స్, దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది.