యాసిడ్ దాడి బాధితురాలు, లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఛపాక్. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 10 న విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో దీపిక నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. కమర్షియల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నిర్మాతకు కాసుల పంట పండింది.
ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకోవడమే కాకుండా దీపిక నటన సినిమాకే హైలెట్ గా నిలవడం విశేషం. ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రభావంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. త్వరలోనే యాసిడ్ దాడితో జీవితాలు కోల్పోయిన బాధితులకు ఫించన్‌ను అందించాలనుకుంటున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి రేఖా ఆర్యా మాట్లాడుతూ, యాసిడ్ దాడి బాధితులు సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రతి ఏడాది రూ.5000-రూ.6000 నగదును ఫించన్‌గా అందించే విధంగా కొత్త పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. కేబినెట్‌లో ఈ పథకం ఆమోదం పొందిన వెంటనే దీనిని అమలులోకి తెస్తామని ఆమె పేర్కొన్నారు. వారి కలలను నెరవేర్చుకోవడానికి ఇది సహకరిస్తుందని అన్నారు.