మూడోరోజు సేవలు ఇవే !

తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహవాహనసేవ జరుగునున్నది. ఈ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు.

ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. మూడో రోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. ఈ సేవలను చూసిన భక్తులు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారు.

– శ్రీ