పూరీలో నిర్మాణమై ఉన్న జగన్నాథ్ ఆలయం మాత్రమే కాకుండా.. పూరీ పరిసర ప్రాంతాల్లోనూ ఎన్నో ముఖ్యమైన ఆలయాలు భక్తులకు కొంగు బంగారంగా మారాయి. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకునే చాలా మంది భక్తులు ఈ ఆలయాలకు కూడా వెళ్తుంటారు.
మన దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటైన పూరీ జగన్నాథ్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. క్రీస్తు శకం 1078 నుంచి 1148 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టాడని ఆధారాలు చెబుతున్నాయి. అయితే పూరీలో నిర్మాణమై ఉన్న జగన్నాథ్ ఆలయం మాత్రమే కాకుండా.. పూరీ పరిసర ప్రాంతాల్లోనూ ఎన్నో ముఖ్యమైన ఆలయాలు భక్తులకు కొంగు బంగారంగా మారాయి. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకునే చాలా మంది భక్తులు ఈ ఆలయాలకు కూడా వెళ్తుంటారు. ఇక జూలై 4వ తేదీన జరగనున్న పూరీ జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తులు కేవలం ఆ ఆలయాన్ని మాత్రమే కాకుండా పూరీ పరిసరాల్లో ఉన్న కింద తెలిపిన ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. మరి ఆ ఆలయాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
1. సాక్షి గోపాల ఆలయం
ఈ ఆలయం పూరీ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూరీ-భువనేశ్వర్ హైవేపై సాక్షి గోపాల అనే పట్టణంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఓ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఈ ఆలయం చూసేందుకు మినీ పూరీ జగన్నాథ్ ఆలయంలాగే ఉంటుంది. ఇక్కడి ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడు.
2. అలర్నథ ఆలయం
పూరీ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరి అనే కొండపై అలర్నథ ఆలయం ఉంటుంది. ఇక్కడి ఆలయంలో విష్ణువు కొలువై ఉంటాడు. సత్య యుగంలో బ్రహ్మ దేవుడు ఇక్కడ విష్ణువుకు పూజలు చేశాడని స్థల పురాణం చెబుతోంది.
3. క్షీర-చోర గోపీనాథ ఆలయం
పూరీ నుంచి కోల్‌కతా వెళ్లే దారిలో బాలాసోర్ రైల్వే స్టేషన్ కు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెమున అనే ఓ చిన్న పట్టణంలో ఈ ఆలయం ఉంటుంది. సుమారుగా 600 సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని నిర్మించనట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు గోపీనాథుడుగా కొలువై దర్శనమిస్తాడు.
4. కోణార్క్ సూర్య దేవాలయం
పూరీకి ఈ ఆలయం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్‌కు అయితే 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో గంగా దేవి విగ్రహాన్ని 1200 మంది కళాకారులు సుమారుగా 12 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించారని చెబుతారు. ఈ ఆలయాన్ని 12 చక్రాలు కలిగిన ఓ రథాన్ని 7 గుర్రాలతో నడుపుతున్న సూర్య దేవుని ఆకారంలో నిర్మించారు. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని కోణార్క్ అని పిలుస్తారు. కోణ అంటే మూల, అర్క అంటే సూర్యుడు అని అర్థాలు వస్తాయి. అంటే సూర్య దేవున్ని ఈ క్షేత్రంలో పూజిస్తారన్నమాట. ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని దర్శిస్తుంటారు. పూరీ సమీపంలో ఉన్న ప్రముఖ దర్శనీయ స్థలాల్లో కోణార్క్ సూర్య దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది.
5. లింగరాజ ఆలయం
ఈ ఆలయం పూరీకి సమీపంలోని భువనేశ్వర్‌లో ఉంటుంది. ఆ ఆలయంలో శివుడు కొలువై ఉంటాడు. ఇక్కడ 55 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం మొత్తం విస్తీర్ణం 2.50 లక్షల చదరపు అడుగులు కాగా ఆలయంలోని శివలింగం వ్యాసం 8 అడుగులు ఉంటుంది. ఇక ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది.