శివుడు మ‌న్మ‌థున్ని మూడో కన్నుతో భస్మం చేసిన ప్రాంతం ఇదే..!

-

శివుడు..మహాదేవుడు. సదా చిన్ముద్రలో సదానందరూపుడై తనలో తను రమిస్తూ ఉంటాడు. అలాంటి ఆయన నుంచి లోకకళ్యాణం కోసం దేవతల కోరిక మేరకు మన్మథుడు బాణప్రయోగం చేస్తాడు. ఆ సమయంలో కోపోద్రిక్తుడైన పరమ శివుడు మన్మథుడిని తన మూడోకన్ను తెరిచి భస్మం చేసాడు. ఆ ప్రదేశం ఎక్కడుంది? దాని ప్రదేశ విశేషాలు ఏవో తెలుసుకుందాం…

అసోంలో, గౌహతికి సమీపంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక దీవి వుంది. పీకాక్ ఆకారంలా వున్న ఆ దీవిని పీకాక్ ఐలెండ్ అంటారు. ఈ పీకాక్ ఐలెండ్ ప్రపంచంలో మనుషులు నివాసమున్న అతి చిన్న దీవిగా కూడా పేరు పొందింది. ఆ దీవిలో ఒక శివాలయం. ఆ ఆలయంలో శివుడు పేరు ఉమానంద. ఈ ఆలయం చేరటానికి బ్రహ్మపుత్ర నది మీద లాంచీలో వెళ్ళాలి. ప్రయాణ సమయం 20 నిముషాలు పడుతుంది. అంతకుముందు లాంచీ దాకా ఒక అర కిలో మీటరు దూరం నడవాలి. ఆ దోవలో ఒక నదీ పాయ దాటటానికి సన్నటి బల్ల మీద నుంచి వెళ్ళాలి. లాంచీ దిగాక దాదాపో 90 మెట్లు ఎక్కాలి. ఈ ఆలయం వున్న చిన్ని కొండను భస్మాచల్ లేదా భస్మకూట అంటారు. ఈ ప్రదేశం గురించి అనేక కథ ప్రకారం… శివుడు ఇక్కడ భయానంద పేరుతో వున్నాడుట. కాళికా పురాణం ప్రకారం శివుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ వుండగా మన్మధుడు తపోభంగం కావిస్తాడు. శివుడు క్రోధితుడై మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అందుకే భస్మాచల్ అనే పేరు వచ్చింది.

మరో స్థానిక కథ ప్రకారం … సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువూ, భూదేవీ కుమారుడైన నరకాసురుడు అని అక్కడి పూజారిగారు చెప్పారు. తర్వాత క్రీ.శ. 1694 లో అహోం రాజు గదాధర్ సింఘ ఈ ఆలయాన్ని పునర్ నిర్మించాడు. మొగలులు కామరూపని పరిపాలించిన సమయంలో మొగలు చక్రవర్తులు జహంగీర్, ఔరంగజేబు ఈ ఆలయానికి అనేక విరాళాలిచ్చారుట.

ఇక్కడ మలచిన శిల్పాలలో శివ కేశవ బేధం లేకుండా సూర్యుడు, శివుడు, గణేష్, దేవి, విష్ణు, ఆయన పది అవతారాలు కనబడతాయి. దీనిని బట్టి ఇక్కడికి వచ్చే భక్తులు వివిధ దేవతారాధకులు అని తెలుస్తోంది. ఈ శిల్పాలు అస్సామీ శిల్పకళకు అద్దం పడతాయి. గర్భ గుడిలో లింగం స్వయంభూ. ఈ లింగం మీద శివ పార్వతులిరువురి రూపం వుంది. లింగం చిన్న గుంటలాంటి దానిలో వున్నది. పైన త్రిశూలం, నాగ పడగ. వెనక కృష్ణుడు, పంచముఖ శివుడు విగ్రహాలున్నాయి. ఈ స్వామిని సోమవారాలు, ముఖ్యంగా అమావాస్య వున్న సోమవారం అర్చిస్తే ఎక్కువ ఫలితం లభిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి కొంచెం దిగువగా ఆంజనేయస్వామి ఆలయం వున్నది. ఈ ప్రాంతం అంతా ప్రకృతి రమణీయతతో అహ్లాదకరంగా ఉంటుంది. పురాణగాథల విశిష్టతతతోపాటు బ్రహ్మపుత్ర నదిలో ఐల్యాండ్‌లో ఉన్న అందమైన దేవాలయం ఇది.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news